నేడే ఢిల్లీ హాఫ్ మారథాన్
Published Sat, Dec 14 2013 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధమైంది. నగరంలో ఆదివారం జరగనున్న ఈ మారథాన్‌లో ఢిల్లీవాసులతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అథ్లెట్లు పాల్గొనేందుకు రెడీ అయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ ఎడ్విన్ కిప్యేగో, వరల్డ్ ఫాస్టెస్ట్ మన్ జియోఫ్రీ కిప్సంగ్ పరుగెత్తనుండటం ఈ పోటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2005 నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ మారథాన్‌లో ప్రముఖ అథ్లెట్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. కెన్యా రన్నర్‌లు కిప్యేగో, కిప్సంగ్ వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు నమోదుచేసేందుకు ఉవ్విళూరుతున్నారని చెప్పారు. ఫిలడెల్ఫియా హాఫ్ మారథాన్‌లో 60.04 సెకన్లతో వ్యక్తిగత రికార్డు నమోదుచేసిన కిప్యేగో మాట్లాడుతూ తన కెరీర్‌లో పరుగెత్తిన వాటిలో ఈ మారథాన్ చాలెంజ్‌తో కూడుకున్నదని అన్నాడు. ‘ఈ నగర వీధుల్లో పరుగెత్తడం చాలా కష్టం. తాను పాల్గొన్నవాటిలో ఇది కఠినమైనది. కానీ ఇప్పటికే కఠోర సాధన చేశారు.
వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు నమోదుచేసేందుకు ప్రయత్నిస్తున్నాన’ని ఆయన తెలిపాడు. ఇతనికి పోటీగా 100 మీటర్ల వరల్డ్ రికార్డు మాజీ హోల్డర్ కిప్సంగ్, ఒలింపిక్ చాంపియన్ దొనొవన్ బైలీ (కెనడా) ఉన్నారు. ఈ ఏడాది జరిగిన రాస్ ఏ వన్ ఖైమా హాఫ్ మారథాన్‌లో 58.54 సెకన్లతో మెరుగైన వ్యక్తిగత రికార్డు సాధించి ఐఏఏఎఫ్ టాప్ లిస్ట్‌లో ప్రథమస్థానంలో నిలిచిన కిప్సంగ్ మాట్లాడుతూ ఆదివారం జరిగే మారథాన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నాడు. 2011లో ఇక్కడ పరుగెత్తినప్పుడు రెండో స్థానంలో నిలిచానని, అయితే ఈసారి మెరుగ్గా రాణించడంపైనే దృష్టి కేంద్రీకరించానని తెలిపాడు. వీరేగాక పురుషుల విభాగంలో సమ్మీ కిత్వర, డెన్నీస్ కిమెట్లో, విల్సన్ కిప్రోప్, లియోనార్డ్ లంగట్, డానియల్ చెబ్బీ, గిర్మానీ గిబ్రసిలస్సీ, నికోలస్ కెంబోయ్‌లు పోటీపడుతున్నారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వుడే అయల్వే, 2012 వరల్డ్ చాంపియన్ మెసిరెట్ హైల్, రాక్ హాఫ్ మారథాన్ విజేత లూసీ కబూ పోటీపడుతున్నారు.
2011లో ఎయిర్‌టెల్ హాఫ్ మారథాన్‌ను నెగ్గిన కబూ ఈసారి కూడా అదే పంథాను కొనసాగిస్తానని కెన్యా అథ్లెట్ కబూ ధీమాను వ్యక్తం చేసింది. ఆనారోగ్యం నుంచి ఇప్పుడే కోలుకున్నానని, పూర్తిస్థాయి ఆటతీరును ప్రదర్శిస్తానని తెలిపింది. ‘మలేరియా బారి నుంచి కోలుకున్నా. ఇప్పటికీ పరిస్థితి సంతృప్తికరంగా లేదు. అయితే నా కుమార్తె ఈ పోటీలో పాల్గొనమని ప్రోత్సహించింది. ఆమె గురించి ఇక్కడా పరుగెత్తబోతున్నాన’ని తెలిపింది. ఢిల్లీలోని చల్లటి వాతావరణం అథ్లెట్లకు కలిసొచ్చే అవకాశముందని వెల్లడించింది. భారత్ తరపున గతేడాది విజేతలు రాహుల్ కుమార్ పాల్, సుధా సింగ్ పురుషులు, మహిళల విభాగాల్లో పరుగెత్తనున్నారు. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శనతో టైటిళ్లు నిలబెట్టుకుంటామని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా మెరుగైనా రికార్డును నమోదు చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశీ అథ్లెట్ల నుంచి తీవ్ర పోటీ ఉన్న విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చిన ప్రముఖ అథ్లెట్లతో పోటీపడటం మంచి అనుభవన్నిస్తుందన్నారు.
హాఫ్ మారథాన్‌తో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఆదివారం నిర్వహించనున్న హాఫ్ మారథాన్‌తో పలు రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలి పారు. మొత్తం ఆరు వరుసల్లో కొనసాగనున్న ఎయిర్‌టెల్ హాఫ్ మారథాన్ ఆదివారం ఉదయం 7.20 గంటల నుంచి జవహర్‌లాల్ నెహ్రూ స్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. మారథాన్ కారణంగా కొన్ని రూట్లలో ట్రాఫిక్ మళ్లించడంతోపాటు అవసరమైన రోడ్లలో పూర్తి స్థాయిలో రాకపోకలను నిలిపివేయనున్నారు. వీటిలో భీష్మ పితామహ్ మార్గ్, లోధీ రోడ్,మథురా రోడ్, సుబ్రహ్మణ్య భారతీ మార్గ్, డా.జాకీర్ హుస్సేన్ మార్గ్, ఇండియా గేట్ మార్గ్, రాజ్‌పథ్, నఫీకివాదయీ మార్గ్, రోడ్‌క్రాస్ స్ట్రీట్, పార్లమెంట్ స్ట్రీట్, అశోకా రోడ్డు,లాలాలజపత్‌రాయ్ మార్గ్, జన్‌పథ్, వింస్డర్‌ప్లేస్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
దారిమళ్లింపు ఇలా:
భీష్మపితామహ మార్గ్ నుంచి కోట్లారెడ్ సిగ్నల్ వరకు, లోధీరోడ్ నుంచి అర బిందోమార్గ్ తిరాహా, లోధీరోడ్ నుంచి మథురారోడ్, లోధీరోడ్ నుంచి లాలాలజపతిరాయ్ మార్గ్ వరకు, మూల్‌చంద్ క్రాసింగ్, మథురా రోడ్ నుంచి శేర్షారోడ్ వరకు, నీలా గుబంద్ మథురారోడ్, జాకీర్ హుస్సేన్ మార్గ్, సుబ్రహ్మణ్య భారతీమార్గ్ క్రాసింగ్, సీ హెక్సాగన్ నుంచి శేర్షామార్గ్, అక్బర్ రోడ్డు నుంచి మాన్‌సింగ్ రోడ్ వరకు, మౌలానా ఆజాద్ రోడ్ నుంచి జనపథ్‌మార్గ్, సున్హరీమజీద్, విజయ్‌చౌక్, పార్లమెంట్ స్ట్రీట్ నుంచి ఇత్మియాజ్‌ఖాన్ మార్గ్, అశోకా రోడ్ నుంచి జయ్‌సింగ్‌మార్గ్, సంసద్‌మార్గ్ నుంచి జంతర్‌మంతర్ రోడ్, అశోకారోడ్ నుం చి బూటాసింగ్ మార్గ్, కేజీమార్గ్ నుంచి ఫిరోజ్‌షా వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
Advertisement
Advertisement