రాజధాని కూలీలు! | Tragedy of Capital city Amaravathi farmers | Sakshi
Sakshi News home page

రాజధాని కూలీలు!

Published Wed, Jan 18 2017 1:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రాజధాని కూలీలు! - Sakshi

రాజధాని కూలీలు!

  • సమీకరణలో భూములు కోల్పోయి కూలీలుగా రైతులు
  • 40 వేల ఎకరాలకు పైగా బీడు పడ్డ రాజధాని భూములు
  • ధాన్యం, కూరగాయల ఉత్పత్తీ లేదు.. రాజధాని నిర్మాణమూ లేదు
  • ఇప్పటికే ఉపాధి కోల్పోయిన రైతులు, కూలీలు
  • సాక్షి ప్రతినిధి/సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కర్షకుడు కన్నీరు పెడుతున్నాడు. ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడే భూములు నేడు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. పదిమందికి ఉపాధినిచ్చే రైతన్న నేడు కూలీగా మారాడు.  రైతు కూలీలకు పనులు దొరక్క పస్తులతో అల్లాడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సంపన్న రైతులు కొందరు మినహా..  మిగిలిన వారెవరిని  పలుకరించినా బతుకుపై భయం వారి కళ్లల్లో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్‌ కింద సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో 27వేల ఎకరాలను సమీకరించింది.

    సమీకరించిన భూమిలో ఇప్పటివరకు ఒక్క ‘తాత్కాలిక సచివాలయ భవనం’ మినహా మరే నిర్మాణం చేపట్టలేదు. సమీకరించిన భూమిని వినియోగించే ప్రయత్నమే చేయకుండా, సమీకరణకు ఇవ్వని భూములను బలవంతంగా లాక్కోవడానికి ‘భూ సేకరణ’ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అటు సమీకరణలో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులు, కూలీలు ఉపాధి కోసం అర్ధరాత్రి నుంచే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ కొత్తగా సేకరణ అస్త్రం ప్రయోగిస్తే.. రైతులు, సమీకరణ చేయని పొలాల్లో కొంతమేర అయినా కూలీ పనులు చేసుకొని బతుకీడిస్తున్న కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందనే ఆందోళనను అధికార వర్గాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సమీకరణలో భూములు కోల్పోయి అల్లాడుతున్న రైతులు, కూలీల స్థితిగతులను తెలుసుకోవడానికి ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. వారి కన్నీటి గాథలివీ.





    పంటలు లేక వెలవెల...
    రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి నిర్మాణానికి 54 వేల ఎకరాలు ల్యాండ్‌పూలింగ్‌ కింద సమీకరించాలని ప్రభుత్వం భావించింది. దీంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న మరో 33 వేల ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చెయ్యమని కేంద్రప్రభుత్వానికి ఇప్పటికి రెండు పర్యాయాలు లేఖ రాసింది. కేంద్రప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించలేదు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 54వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి 21వేల ఎకరాలు పోను రైతుల నుంచి సుమారు 33వేల ఎకరాలను సమీకరించాలని భావించింది. అయితే రైతులు ఎదురు తిరగటంతో 27వేల ఎకరాలతో సమీకరణకు బ్రేక్‌ పడింది.  

    ► ‘భూ సమీకరణ’ పేరిట తీసుకున్న భూములు, ప్రభుత్వ భూములు కలిపి..  మొత్తం 40 వేల ఎకరాల్లో పంట లేకుండా బీళ్లుపడ్డాయి. ఇక్కడ 12,820 ఎకరాల్లో ధాన్యం, 11,675 ఎకరాల్లో పత్తి సాగుచేసేవారు. మిగతా భూముల్లో పూలు, కూరగాయలు, పండ్లు పండించేవారు.  

    ఉపాధి లేదు... పింఛన్లు రావు...
    రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మొత్తం 22వేల మంది రైతులు ఉన్నారు. ఇందులో రెండెకరాల లోపు ఉన్న రైతులు 15వేల మంది ఉన్నారు. అదే విధంగా 22వేల కుటుంబాలకుపైగా రైతు కూలీలు జీవిస్తున్నారు. రైతు కూలీలకు ప్రతినెలా ఒక్కో కుటుంబానికి రూ.2,500 పింఛను చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పించన్లు 3, 4 నెలలకొకసారి చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీల ద్వారా జరిగింది. ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకోవడంతో అనేకమంది లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది.

    ► ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ.20 లక్షలు బ్యాంకు షూరిటీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని    ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా భూములు తీసుకునే రోజున ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు కాలేదు.
    ► ప్రతి గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగం గా ప్రతి పంచాయితీకి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేస్తామని భూములు తీసుకునే సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటికి ఏ ఒక్క గ్రామానికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయలేదు.

    3.8 కోట్ల కేజీల బియ్యం దిగుబడి కోల్పోయాం
    రాజధాని ప్రాంతంలో 12,820 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. సరాసరిన ఖరీఫ్‌లో ఎకరాలకు 40 బస్తాలు, రబీలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. ఒక్కో బస్తాలో 58 కేజీల ధాన్యం నింపుతారు. భూమి సారవంతమైనది కావడం, సాగునీటి సమస్య లేకపోవడం వల్ల దిగుబడికి గ్యారంటీ ఉండేది. 100 కేజీల ధాన్యాన్ని మర పట్టిస్తే 68 కేజీల బియ్యం వస్తాయి. నూక, తౌడు.. ఉప ఉత్పత్తులు. ఈ లెక్కన చూస్తే.. రాజధాని ప్రాంతంలో ఏటా 3.8 కోట్ల కేజీల బియ్యం ఉత్పత్తిని కోల్పోయాం. అంటే దాదాపు 19 కోట్ల మందికి ఒక పూట భోజనానికి సరిపోయే బియ్యాన్ని ఉత్పత్తి కాకుండా.. దాదాపు అంతేమందికి ఒక పూట కూరగాయలు ఇచ్చే భూమిని రాజధాని కోసం తీసుకొని నిరుపయోగంగా వదిలిపెట్టేశారు. 19 కోట్ల మందికి ఒక పూట భోజనం పెట్టడానికి సరిపోయే బియ్యం, కూరగాయలు ఉత్పత్తి కాకుండా ఆగిపోయిన సంగతి అటుంచితే... రాజధాని నిర్మాణమైనా అడుగు ముందుకు పడిందా అంటే అదీ లేదు. అమరావతి ఇప్పుడు రెండింటికీ చెడిపోయిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.


    ► రాజధానిలో గ్రామాలు: 29
    ► రైతుకుటుంబాలు: 22 వేలు
    ► 2 ఎకరాల్లోపున్న కుటుంబాలు: 15 వేలు
    ► రైతు కూలీల కుటుంబాలు: 22 వేలు
    ► సమీకరించనున్న∙విస్తీర్ణం: 54 వేల ఎకరాలు
    ► ప్రభుత్వ భూమి: 21 వేల ఎకరాలు
    ► రైతుల నుంచి సమీకరించాలనుకున్న
        భూమి: 33 వేల ఎకరాలు
    ► సమీకరించిన భూమి: 27 వేల ఎకరాలు
    ► బలవంతంగా సేకరించాలనుకుంటున్న
        భూమి: 6 వేల ఎకరాలు

    కూలికీ దూరాభారమే
    రాజధాని గ్రామాల నుంచి 20–30 కిలోమీటర్లు ట్రాక్టర్‌ మీద తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లి సాయంత్రానికి ఇళ్లు చేరుతున్న కూలీలు ఎంతోమంది ఉన్నారు. శాఖమూరు గ్రామానికి చెందిన రైతులు, కూలీలు 30 కి.మీ దూరంలో ఉన్న రావెలకు కూలీ పనికి వెళ్లి ట్రాక్టర్‌ ట్రక్కులో వస్తున్న దృశ్యం సాక్షి కంట పడింది. ట్రాక్టర్‌లో ఉన్న ఎవరిని కదిలించినా.. ఆవేదన పెల్లుబికి వచ్చింది. అందులో ఒకరు అశోక్‌. ఆయన ఏమన్నారంటే.. ‘‘రోజూ వేకువ జామునే లేచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావెల చుట్టుపక్కల గ్రామాల్లో పత్తి కోత పనికి వెళ్తున్నాం. కిలో పత్తి కోస్తే రూ.8 చొప్పున చెల్లిస్తారు. వచ్చిన కూలీ డబ్బులతో రానుపోను ఆటో, భోజనం ఖర్చుపోను మిగిలింది ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. రాజధానికి భూములు తీసుకోకమునుపు శాఖమూరు గ్రామం చుట్టుపక్కలే కూలి పనులకు భార్యతో కలిసి వెళితే రోజుకు రూ. 1,300 సంపాదించేవాళ్లం. ఇప్పుడు ఇద్దరు కలిసి కూలీ పనికి వెళ్లినా రూ.500 రావటం లేదు’’. – అశోక్, శాఖమూరు

    కూలీలుగా మారిన రైతన్నలు..
    తుళ్లూరు మండలం మోదుగు లింగాయపాలెంలో 25 మంది రైతులు, 250 మంది కూలీలు ఉన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించడంతో రైతులు జీవనాధారాన్ని కోల్పోయారు. భూములన్నీ ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికిచ్చేయడంతో సాగు నిల్చిపోయింది. చిన్న, సన్నకారు రైతులకు, కూలీలకు ఉపాధి కరువైంది. రైతులంతా కూలీలుగా మారిపోయారు. సాక్షి బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించినప్పుడు మోదుగులింగాయపాలెం రైతులు లంక పొలాల్లో కూలి చేసుకుంటూ కనిపించారు. అందులో మదిరపల్లి కన్నారావు ఒకరు. సాక్షి బృందం ఆయనను పలకరిస్తే కన్నీరుమున్నీరయ్యారు. ‘‘మా కుటుంబానికి  మూడెకరాల పొలం ఉండేది. ముగ్గురు అన్నదమ్ములు ఎకరం చొప్పున పంచుకున్నాం.

    ముగ్గురు అన్నదమ్ములు కలసి 10 ఎకరాలు కౌలుకు తీసుకొని దొండ సాగుచేసేవాళ్లం. ప్రతిరోజూ 15 మంది కూలీలకు ఉపాధి కల్పించేవాళ్లం. ల్యాండ్‌ పూలింగ్‌కు భూమి ఇవ్వకూడదని తొలుత అనుకున్నా... పొలంలో బొంగులు, ఇతరత్రా వాటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. చేసేదిలేక ల్యాండ్‌పూలింగ్‌కు మా భూమి ఇచ్చేశాం. చేతిలో ఉన్న డబ్బుతో కొన్నాళ్లు కుటుంబాన్ని నడుపుకున్నాం. ప్రభుత్వం ఇస్తున్న కౌలు డబ్బులు ఖర్చులకు సరిపోవడం లేదు. అది కూడా ప్రతినెలా కాకుండా, మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇస్తుండటం కూడా ఇబ్బందిగా మారింది. కుటుంబ జీవనం కష్టమైంది’’ అని చెప్పారు. గత్యంతరం లేక ప్రస్తుతం లంక భూముల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నామని వాపోయారు. రోజుకు 15 మందికి ఉపాధి కల్పించే తమ కుటుంబం మొత్తం ఈ ప్రభుత్వం వల్ల కూలీలుగా మారిపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement