చెట్టుంది జాగ్రత్త | tree accidents in udyanagiri | Sakshi
Sakshi News home page

చెట్టుంది జాగ్రత్త

Published Mon, Sep 11 2017 10:34 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

చెట్టుంది జాగ్రత్త

చెట్టుంది జాగ్రత్త

ఉద్యాననగరిలో చీటికిమాటికీ కూలుతున్న వృక్షాలు
ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు
పర్యవేక్షణ లేని పాలికే


చల్లని నీడనిచ్చే చెట్టు ప్రాణాలను తీస్తుందా.. ఏమిటీ జోక్, ఎవరైనా వింటే నవ్విపోతారు అని అనుకోవచ్చు. కానీ బెంగళూరులో తరచూ పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడం, అవి వాహనాలు, ప్రజల మీద పడి ప్రాణనష్టం జరగడం తరచూ జరుగుతోంది. అంతర్జాతీయంగా బెంగళూరు నగరానికి గార్డెన్‌సిటీగా పేరుప్రఖ్యాతులు రావడానికి ప్రధాన కారణమైన పచ్చని చెట్లు గత కొద్ది కాలంగా ప్రజల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి. మొత్తం 800 చదరపు కిలోమీటర్ల విస్తరించిన బీబీఎంపీ పరిధిలో సుమారు 14 లక్షల చెట్లు ఉండగా వాటి నిర్వహణపై బీబీఎంపీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు చెదలు పట్టి కూలిపోతున్నాయి.

సాక్షి, బెంగళూరు :
ఉద్యాననగరంలో చెట్ల వల్ల పెద్ద చిక్కొచ్చిపడింది. శిథిలమైన, ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొమ్మలు కూలిపోతూ అనేక రకాలుగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి చెట్లను తొలగించి ప్రమాదాలు నివారించడానికి బీబీఎంపీ కాంట్రాక్ట్‌ పద్ధతిన 168 మందితో 21 బృందాలు నియమించింది. చెట్ల సంఖ్యతో పోలిస్తే ఈ సిబ్బంది ఏ మూలకూ చాలడం లేదు. సిబ్బంది కొరత కారణంగా చెట్ల తొలగింపు చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ బృందాలు కూడా కేవలం వర్షాకాలంలో మాత్రమే చెట్ల తొలగింపు చర్యల్లో పాల్గొంటూ మిగిలిన కాలాల్లో గాలికొదిలేస్తుండడం కూడా సమస్య జఠిలమవడానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు.

విదేశీ చెట్లు పెంచడం కారణమా?
బెంగళూరు పాలికే భౌగోళిక పరిస్థితి, మృత్తిక స్వభావానికి విరుద్ధంగా విదేశాల్లో పెరిగే చెట్లను ఇక్కడ కూడా పాలికే అధికారులు పెంచుతున్నారు. తబూబియా, గుల్‌మొహర్, రైన్‌ ట్రీ, కాపర్‌వుడ్‌ తదితర జాతి చెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అందం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఈ చెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు. వీటి వేర్లు భూమితి గట్టిగా పట్టుకోవు.
అంతేకాకుండా  ఈ జాతి చెట్లు వయస్సు కేవలం 25 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. అయితే సదరు చెట్లను ఎప్పుడు నాటారు, వాటిని ఎప్పుడు తొలగించాలి అనే రికార్డులు బీబీఎంపీ వద్ద లేవు. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట ఇటువంటి చెట్లు కూలి ప్రాణ, భారీ ఆస్తినష్టం సంభవిస్తోంది.

చెట్లకు ముప్పు ఇలా
వివిధ కారణాలతో నగరవ్యాప్తంగా ఉన్న భారీ చెట్ల చుట్టూ సిమెంటు గోడలు, సిమెంటు కుర్చీలను నిర్మించడంతో చెట్ల వేర్లు,కాండాలకు గాలి,నీరు అందకపోవడంతో అనేక చెట్లు నిర్జీమవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారసంస్థలు తమ ప్రకటనల హోర్డింగులకు అడ్డుగా ఉన్నాయనే నెపంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల వేర్లలో విషపూరిత రసాయనాలు చల్లుతూ వాటిని నిర్వీర్యం చేస్తుంటారు. మురికికాలువల నిర్మాణాలు, తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ కేబుళ్లు, ఓఎఫ్‌సీ కేబుళ్ల తదితర వాటి కోసం రోడ్లపై, రోడ్లకు ఇరువైపులా ఉన్న వేర్లు, కొమ్మలు తొలగిస్తుండడంతో చెట్లు సమతౌల్యాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి చెట్లు ఈదురు గాలులకు, వర్షాలకు ప్రజలపై కూలిపడుతూ ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి.

గత ఐదేళ్లలో చెట్లు కూలి జరిగిన ప్రాణనష్టం
2012 మే1న సంజయ్‌నగర్‌లోని నాగశెట్టిహళ్లిలో రావిచెట్టు కూలి రవి(45) వ్యక్తి మృతి.
2012 జూన్‌6న సంపిగేహళ్లి సమీపంలోని టెలికాం లేఅవుట్‌లో కొబ్బరిచెట్టు కూలి వీరణ్ణ(50) మృతి.
2013 మే8న బసవేశ్వరనగర్‌లోని మోదీ ఆసుపత్రి రోడ్‌లో ఆటోపై చెట్టు కూలి ఆటోలో ప్రయాణిస్తున్న గీత (52)మృతి.
2015 మే 29 హొసూరు రోడ్‌లోని ఆనేపాళ్య బస్టాప్‌పై చెట్టు కూలడంతో మాధవరెడ్డి (50)మృతి, ఐదుగురికి గాయాలు.
2015 జూన్‌10 ఆడుగోడిలోని సీఎస్‌ఆర్‌ వసతి సముదాయంపై చెట్టు కూలడంతో పుట్టగంగప్ప (80)మృతి.
2015 సెప్టెంబర్‌18 గరుడామాల్‌ సమీపంలోని డిసౌజా సర్కిల్‌లో చెట్టు కూలి యల్లయ్య (35) కార్మికుడు మృతి.
2015 డిశెంబరు 10 విజయనగర్‌లోని ఎంసీ లేఅవుట్‌లో బైకుపై చెట్టు కూలి మంజునాథ్‌ (35) మృతి.
2016 జూన్‌27 వివేక్‌నగర్‌లోని 7వ క్రాస్‌రోడ్‌లో  చెట్టు కూలి జీవన్‌ (7) మృతి.ఇదే రోజు మల్లేశ్వరంలోని 18వ క్రాస్‌లో బైక్‌పై చెట్టు కూలి పాషా(50) మృతి..
2016 జులై 10 బసవనగుడిలోని కే.ఆర్‌.రోడ్‌లో ఆటోపై కొబ్బరి చెట్టు కూలి ఇంతియాజ్‌(45)మృతి.
2017 సెప్టెంబర్‌ 8 జే.సీ.రోడ్‌లోని డిస్పన్సరీ రోడ్‌లోని కారుపై నీలగిరి చెట్టు కూలి భార్యభర్తలు భారతి, రమేశ్, బంధువు జగదీశ్‌ మృతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement