
త్రిషకు కోపం వచ్చింది
నటి త్రిషకు కోపం వచ్చింది. త్రిష అందాన్ని మాత్రమే ఆస్వాదించే ప్రేక్షకులకు ఆమెకు కోపం వస్తే ఎలా భగ్గుమంటారో తెలియదు. ఇంతకుముందెప్పుడూ ప్రదర్శించనటువంటి ఆగ్రహాన్ని ఈ చెన్నై చిన్నది ఇప్పుడే ప్రదర్శించారు. దీనికి కారణం లేకపోలేదు. నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థం త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతున్నారంటూ ఇటీవల మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఒక టాలీవుడ్ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన త్రిష తాజాగా వరుణ్‌మణియన్ ప్రేమలో పడ్డారనే ప్రచారం మారుమోగిపోతోంది. ఈ వ్యవహారం గురించి త్రిష, ఆమె తల్లి ఉమ ఖండించినా లాభం లేకపోయింది.
దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో త్రిష కథానాయికల్ని ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తున్నారన్నారు. నిజానికి అలాంటి ప్రత్యేకత లేవీ తమకు లేవన్నారు. తాము సాధారణ మనుషులమేనన్నారు. అందరిలానే తమకు మనసు ఉంటుందని, ప్రేమ, పెళ్లి లాంటి ఆశలుంటాయన్నారు. ఇతరుల మాదిరిగానే తాము జీవించాలని ఆశిస్తున్నామన్నారు. తమకు ఇష్టాఇష్టాలు ఉంటాయని ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమను గౌరవించాలని కోరుకుంటున్నానన్నారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి తప్పుగా చిత్రీకరిస్తూ కలకలం సృష్టించకండి అంటూ బాధతో కూడిన ఆవేదనను, ఆగ్రహాన్ని త్రిష వ్యక్తం చేశారు.