మఫ్టీ తెచ్చిన తంటా | Troubles brought maphti | Sakshi
Sakshi News home page

మఫ్టీ తెచ్చిన తంటా

Published Wed, Dec 3 2014 2:29 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ముంబై వెళ్లిన కర్ణాటక పోలీసులను.. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు

ముంబై పోలీసుల అదుపులో కర్ణాటక పోలీసులు  
ఉన్నతాధికారి జోక్యంతో కథ సుఖాంతం

 
బెంగళూరు : నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ముంబై వెళ్లిన కర్ణాటక పోలీసులను.. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు...  ముంబైకు చెందిన డాక్టర్ సంతోష్ రై తనకు ధార్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినిమా నటీనటులతో పాటు దేశంలోని వివిధ వైద్య విద్యా కళాశాల డెరైక్టర్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. అందరినీ నమ్మించడానికి వీలుగా అప్పుడప్పుడు యాగాలు, రాజకీయ నాయకులతో కలిసి ధర్నాలు చేయడంతో పాటు చిన్న చిన్న సినిమా, టీవీ సీరియల్స్ ప్రారంభోత్సవాలు, పాటల విడుదల కార్యక్రమాల్లో పాల్గొని హడావుడి చేసేవారు. అంతేకాకుండా హెల్త్ అండ్ హెల్త్ సొసైటీ ఆఫ్ ఇండియా, బ్రహ్మశ్రీ హెల్త్ కేర్ అండ్ రీసర్చ్ తదితర సంస్థలకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా తనను తాను పేర్కొనేవాడు. ఈ మేరకు వెబ్‌సైట్లను సృష్టించి సోషియల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే వాడు. ఇతని మాయలో పడిన అనేక మంది ఉత్తర భారత దేశానికి చెందిన విద్యార్థులు లక్షలాది రూపాయాలను మెడికల్ సీట్ల కోసం పోగొట్టుకున్నారు. ఈ విషయమై ముంబైతో పాటు ఢిల్లీ, హర్యానా తదితర నగరాల్లో ఇతనిపై ఇప్పటికే అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ విద్యా ఏడాది ప్రారంభంలో తన మకాంను బెంగళూరుకు మార్చి కర్ణాటకలోని కిమ్స్, అంబేద్కర్ మెడికల్ కళాశాల, బెంగళూరు మెడికల్ కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెబుతూ 12 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ.1.20 కోట్లను వసూలు చేసి ముంబైకు వెళ్లిపోయాడు. ఈ విషయమై నగరంలోని తిలక్ నగర్‌తో పాటు మరో రెండు మూడు పోలీస్‌స్టేషన్‌ల్లో కేసులు నమోదయ్యాయి.  సంతోష్‌రై వాడుతున్న సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి అతను ముంబైలో ఉన్నట్లు  కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఆదివారం నలుగురు పోలీసులు ముంబైకు వెళ్లారు. యూనిఫాంతో వెళితే తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉందని భావించి వారు మఫ్టీలో సంతోష్ రై ప్రాంతాన్ని చేరుకుని అతని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరు పోలీసు వాహనాన్ని కాక కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా కారును తమతో తీసుకువెళ్లారు. సంతోష్‌రైను అదుపులోకి తీసుకొన్న తర్వాత అతని మొబైల్ నుంచి అవుట్‌గోయింగ్ కాల్స్‌ను కట్ చేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన కుటుంబ సభ్యులకు విషయం చెబుతానని లేదంటే భయపడుతారని సంతోష్ రై విజ్ఞప్తి చేశాడు. మానవీయతా దృష్టితో పోలీసులు అతనికి అవకాశం కల్పించగానే ‘నలుగురు దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో నన్ను బెంగళూరుకు తీసుకువెళుతున్నారు. పోలీసులకు తెలియజేసి నన్ను రక్షించండి’ అని మరాఠిలో తెలిపారు. వెళ్లిన పోలీసులెవరికీ మరాఠి రాకపోవడంతో వారు మిన్నకుండిపోయారు.

వెంటనే సదరు కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో ముంబైకు ఐదు కిలోమీటర్ల దూరంలో వాహనాన్ని ఆపి నలుగురు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎంత చెప్పినా మహారాష్ట్ర పోలీసులు వినిపించుకోలేదు. ఐడీ కార్డులు చూపించినా అవి నకిలీవని కొట్టిపారేసి అందరినీ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. తర్వాత  చాలా బతిమాలితే మఫ్టిలోవెళ్లిన పోలీసులకు కర్ణాటక ఉన్నతాధికారులతో మాట్లాడటానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హేమంత్ నిబాల్కర్ విషయం తెలుసుకుని మరాఠిలో ముంబై పోలీసులతో మాట్లాడి అవసరమైన రుజువులు చూపించి పరిస్థితిని కొలిక్కితెచ్చారు. దీంతో ఆ పోలీసులు నిందితుడు సంతోష్ రైతో పాటు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నగర ఆగ్నేయ విభాగం డీసీపీ రోహిణికటోచ్ ధ్రువీకరించారు. సంతోష్ రై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement