‘టీఆర్‌పీ’లో బందీగా ‘చానళ్లు’
టీఆర్‌పీ వ్యవస్థలో బందీగా చానళ్లు ఉన్నాయని సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ డాక్టర్ కే.రామచంద్రమూర్తి అన్నారు. పుస్తకాలు రాయడం చాలాకష్టమన్నారు. చానళ్ల రాకతో జర్నలిజం విస్తరించిందన్నారు. రచయిత నాగసూరి వేణుగోపాల్ రచించిన ‘చర్చనీయాంశాలుగా చానళ్లు’పుస్తకాన్ని రామచంద్రమూర్తి ఆవిష్కరించారు.
సాక్షి, చెన్నై:చెన్నై ఆలిండియో రేడియోలో తెలుగు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తెలుగు టీవీ జర్నలిజం తీరు తెన్నుల్ని ఎత్తి చూపుతూ ‘చర్చనీయాంశాలుగా చానళ్లు’ పుస్తకాన్ని రచించారు. తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తేజస్) ఆధ్వర్యంలో ఆస్కా ఆవరణలో ఆదివారం ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని చెన్నై ఆలిండియో రేడియో డెరైక్టర్ సుబ్రమణియన్ అందుకున్నారు. కే.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ, జర్నలిస్టులు వృత్తి పరంగా రాణిస్తూనే, పుస్తకాల్ని రాయడం అన్నది చాలా కష్టంగా వ్యాఖ్యానించారు. రచయిత ఈ పుస్తకం ద్వారా తన మీద కూడా ఓ బాణాన్ని విసిరినట్టుగా చమత్కరించారు. మీడియాపై గురి పెట్టి వరుసగా పుస్తకాల్ని నాగసూరి రచించడం అభినందనీయమన్నారు.
చానళ్ల నిర్వహణ చాలా కష్టంగా పేర్కొంటూ, 24 గంటలు పరుగులు తీయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రేకింగ్‌లో గానీయండి, విజువల్స్‌లో గానీయండి.. అన్నింటా తామే ముందు ఉండాలన్న కాంక్షతో ఉరుకులు పరుగులు తీస్తున్నారని గుర్తుచేశారు. టీఆర్‌పీలో బందీ: టీఆర్‌పీ వ్యవస్థలో బందీగా చానళ్లు ఉన్నాయని వివరించారు. సమాజ హితాన్ని కాంక్షించేంత మంచి కార్యక్రమాల్ని ప్రసారం చేసినా, వాటికి మాత్రం టీఆర్‌పీ రేటింగ్స్ రావడం లేదన్నారు. అదే, ఓ ప్రకటన కార్యక్రమాన్ని ప్రసారంచేస్తే చాలు రేటింగ్స్ పెరుగుతోన్నాయని పేర్కొన్నారు. ప్రకటనలకు ఉన్నంత రేటింగ్స్, మంచి వార్తలు, కథనాలు రాకపోవడం శోచనీయమన్నారు. ఇక, చానళ్లలో ఉంటేచాలు గొప్పగా ప్రజాసేవ కూడా చేయొచ్చని పేర్కొన్నారు.
హెచ్‌ఎం టీవీలో తాను ఉన్నప్పుడు అప్పటి హోం మంత్రి చిదంబరం చేసిన ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ దశదిశ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల గురించి ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తాను ప్రతి జిల్లాలో పర్యటించానని, ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఎవ్వరూ చేయనంతగా ఆరేడు గంటల పాటుగా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు. ప్రస్తుతం టీవీ చానళ్లలో అనవసర విషయాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. అలాగే, అశ్లీలత చోటుచేసుకుంటున్నాయని, పెయిడెడ్ వార్తలూ పెరిగాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నా, అనేక ప్రయోజనకర విషయాలు చానళ్ల ద్వారా వెలుగులోకి వచ్చాయని వివరించారు. గుజరాత్ ఘటన గురించి నేటికీ చర్చ ఏదో ఒక మూల సాగుతున్నదంటే, టీవీ చానళ్ల వల్లేనన్నారు. పత్రికలు సైతం వెలుగులోకి తీసుకురాని అనేక విషయాలను ఆ ఘటనకు సంబంధించి టీవీ చానళ్లు తీసుకొచ్చాయని వివరించారు. టీవీ చానళ్ల తీరుతెన్నుల గురించి పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయిత, ఎవర్నీ నొప్పించుకుండా వ్యవహరించి ఉన్నారని ఈసందర్భంగా అభినందించారు.
పుస్తక సమీక్ష:చెన్నై ఆలిండియో రేడియో డెరైక్టర్ కే.సుబ్రమణియన్ ప్రసంగిస్తూ, తనకు తెలుగు నేర్చుకోవాలన్న ఆశ ఉందని, ఏదో ఒక రోజు తెలుగులో తప్పకుండా ప్రసంగిస్తానని పేర్కొన్నారు. అలాగే, సంగీతం అంటే, తెలుగేనని వ్యాఖ్యానించారు. ఇక, ది హిందూ పత్రిక ప్రముఖ కార్టూనిస్టు సురేంద్ర ఈ పుస్తకం గురించి సమీక్షించారు. ఒకప్పటి అద్భుత ప్రగతిని ఇప్పుడు అధోగతి పాలు చేస్తున్నారంటూ చానళ్ల తీరు తెన్నుల్ని ఎత్తిచూపారు. రచయిత నాగ సూరివేణుగోపాల్ ప్రసంగిస్తూ, చెన్నైలో ఒకప్పుడు తెలుగు పత్రికలు దొరికేవి కావని, ఇప్పుడు పత్రికలు, చానళ్లు వచ్చాయని, డీటీహెచ్‌లు రావడంతో అన్ని చానళ్లు ప్రసారమవుతున్నాయని గుర్తుచేశారు. అయితే, తెలుగు చానళ్లను అడ్డుకునే కార్యక్రమాలూ సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ తెలుగు వారు అధికం అని గుర్తు చేస్తూ, ఇక్కడి తెలుగు వారి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వారు తెలుసుకునే రీతిలో పత్రికల్లో చోటు కల్పించాలని విన్నవించారు. ముందుగా జర్నలిస్టు అసోసియేషన్ చేస్తున్నకార్యక్రమాల గురించి తేజస్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు వివరించారు. తేజస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మన్నవ గంగాధర ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, కోశాధికారి గోటేటి వందన సమర్పణ చేశారు.