విపక్షాలకు కడుపుమంట ఎందుకు?
విపక్షాలకు కడుపుమంట ఎందుకు?
Published Thu, Apr 13 2017 2:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
హైదరాబాద్: తెలంగాణలో 91 శాతమున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గత పాలకులు కేవలం ఓటు బ్యాంకులుగానే పరిగణించారు. వారి కనీస అవసరాలు తీర్చడంలో సమైక్య పాలకులు విఫలమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జరిగిన తప్పిదాలను సరిచేస్తుంటే విపక్షాలకు కడుపు మంట ఎందుకోనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆయన గురువారం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
‘‘వెనకబడిన, చిన్న చిన్న వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పూలే అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు రాజ్యాంగాన్ని అవమానించినట్టే.. మత పరమైన రిజర్వేషన్లు అంటూ కొన్ని పార్టీలు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి.. బీసీలకు ఇపుడున్న రిజర్వేషన్లు తగ్గించం ఇంకా పెంచుతాం అని కేసీఆర్ చెబుతున్నా ఇంకా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? చట్టసభల్లో కూడా బీసీలకు ౩౩ శాతం రిజర్వేషన్లు ఉండాలని శాసనసభ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం..
మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే.. బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్న పార్టీలు పార్లమెంటులో చట్టసభల రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి యత్నించాలి.. అన్ని వర్గాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్నాయి. టీఆర్‌ఎస్ బలీయమైన శక్తిగా మారుతుందనే భయంతోనే విపక్షాల కుట్రలు చేస్తున్నాయి.. వారి కుట్రలు ఛేదిస్తాం.. అణగారిన వర్గాలకు అండగా నిలుస్తామని’’ అన్నారు.
Advertisement