హైదరాబాద్: రిజర్వేషన్లు కల్పించడం తాత్కాలిక పరిహారమే కానీ శాశ్వత పరిష్కారం కాదని లోక్‌సత్తా తెలంగాణ విభాగం పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా రిజర్వేషన్లు రావణకాష్టంగా రగులుతూనే ఉండడానికి పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కుల, మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత నాణ్యమైన విద్య, ఆరోగ‍్యం కల్పిస్తే ఆర్థికాభివృద్ధికి అవి దోహదపడతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
క్రిమీలేయర్‌ను గుర్తించి వారికి రిజర్వేషన్లు తొలగించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, నెలవారీ వేతనాలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగులకు గ్యాస్, రేషన్, పింఛన్లు తదితర రాయితీలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లుక కల్పించాలని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలు పోవాలని, రిజర్వేషన్లపై పునః సమీక్ష జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి సూచించారు.