న్యూఢిల్లీ: పోలీస్ ఉద్యోగమంటేనే సవాళ్లతో కూడుకున్నది.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎంతోమంది సంఘ విద్రోహశక్తులతో పోరాడాల్సి ఉంటుంది.. ఒక్కోసారి విధినిర్వహణలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి ఉంటుంది.. అయినా ఆ శాఖలో పనిచేసేందుకు ఎవరూ భయపడటం లేదంటే ఆశ్చర్యంలేదు. కాగా, ఈ ఏడాది ఢిల్లీ పోలీస్‌శాఖలో విధుల్లో అశువులు బాసినవారి సంఖ్య 16కు చేరింది. ఇందులో నలుగురు తుపాకీ కాల్పుల్లో మృతిచెందగా, మిగిలినవారు డ్యూటీలో ఉండగానే రోడ్డుప్రమాదాల్లో, గుండెపోటుతో మరణించారు.
గత సోమవారం రాత్రి మద్యం వ్యాపారులు ఒక కానిస్టేబుల్‌ను కాల్చి చంపగా, మంగళవారం ఉదయం ట్రక్ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న కానిస్టేబుల్ మృతిచెందాడు. 2011లో ఒకరు, 2012లో నలుగురు, 2013లో ఒక పోలీస్ అధికారి సంఘ విద్రోహ శక్తులు జరిపిన కాల్పుల్లో మృత్యువాత పడ్డారు. కాగా, సంఘ విద్రోహశక్తులు వాడుతున్న మారణాయుధాలు అధునాతనమైనవి కాగా, పోలీసు శాఖ ఇప్పటికీ పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆయుధాలనే వినియోగిస్తోంది. దీంతో విద్రోహులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీసు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మృత్యువాత పడిన పోలీస్ సిబ్బందితో పాటు గాయాలపాలైన వారికి సైతం పోలీస్ శాఖ నష్టపరిహారం అందిస్తోందని ఢిల్లీ పోలీస్ అధికారప్రతినిధి రజన్ భగత్ తెలిపారు.
‘విద్రోహులను ఎదుర్కోవడంలో పోలీసులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. బ్యాచుల వారీగా నిర్ణీత కాలం శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించాం.. ఒక్కో బ్యాచ్‌లో 20-25 మంది ఉంటారు. ఈ శిక్షణ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. దీనికోసం ప్రతి జిల్లాలోనూ ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నాం. రోడ్డు నిబంధనల ఉల్లంఘనలు, వాహనాలు, ఆయుధాల తనిఖీలు చేపట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ సమయంలో సిబ్బందికి తగిన అవగాహన కల్పిస్తాం..’అని పోలీస్ జాయింట్ కమిషనర్ (ఉత్తర పరిధి) ఆర్.ఎస్.కృష్ణ వివరించారు.
‘విధి’ బలి తీసుకుంది..
Published Thu, Jan 15 2015 12:43 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement