
నీట్ పరీక్షలో కవలల ప్రతిభ
నీట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన కవల విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. వైద్య కళాశాలలో విద్యార్థులు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో జరిగిన పరీక్ష (నీట్ పరీక్ష) ఫలితాలు శుక్రవారం ఉదయం విడుదలయ్యాయి.
తిరువొత్తియూరు: నీట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన కవల విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. వైద్య కళాశాలలో విద్యార్థులు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో జరిగిన పరీక్ష (నీట్ పరీక్ష) ఫలితాలు శుక్రవారం ఉదయం విడుదలయ్యాయి. నీట్ పరీక్షలో మొదటి 25 ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబితాలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎవరూ స్థానం పొందలేదు. ర్యాంకుల జాబితాలో స్థానం పొందనప్పటికీ నీట్ పరీక్షలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వందవాసికి చెందిన అన్బుభారతి, నిలాభారతి అనే కవల సహోదరిణులు వందవాసి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదివారు.
ఇటీవల జరిగిన ప్లస్‌టూ పరీక్షల్లో అన్బుభారతికి 1200 మార్కులకు 1165 మార్కులు, నిలాభారతి 1169 మార్కులు సాధించారు. తర్వాత వీరిద్దరు నీట్ పరీక్షలు రాశారు. ఈ క్రమంలో శుక్రవారం విడుదలైన నీట్ పరీక్షా ఫలితాల్లో ఈ కవలలు ఉత్తీర్ణత సాధించారు. ఈ కవలలు విలేకరులతో మాట్లాడుతూ తాము ప్లస్‌టూ పరీక్షలు రాసిన తరువాత ఐదు రోజులే విశ్రాంతి తీసుకున్నామని, తర్వాత 2014 నీట్ పరీక్ష మాదిరి ప్రశ్నా పత్రాలు, సీబీఎస్‌సీ సిలబస్‌కు చెందిన 11, 12 తరగతుల పాఠ్యపుస్తకాలను చదివి నీట్ పరీక్షకు హాజరైనట్టు తెలిపారు. ఈ నీట్ పరీక్షల్లో అన్బుభారతి 151 మార్కులను, నీలాభారతి 146 మార్కులను పొంది క్వాలిఫైడ్ జాబితాలో స్థానం సాధించారు.