భవనంపై నుంచి దూకుతున్న జస్లిన్ కౌర్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ ఎంట్రన్స్ ‘నీట్’లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అందరూ చూస్తుండగానే పదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి అంతలోనే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
టీవీ చానల్స్‌లో చూసి..
కాచిగూడ బర్కత్‌పురాలోని కైబాన్ అపార్ట్‌మెంట్‌లో నివసించే బట్టల వ్యాపారి రణ్‌వీర్ సింగ్, లవ్లీన్ కౌర్‌లకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె జస్లిన్ కౌర్(18) నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. చదువుల్లో చురుగ్గా ఉండే జస్లిన్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సోమవారం వెలువడిన ‘నీట్’ ఫలితాల్లో ఈమెకు అనుకున్నంత ర్యాంక్ రాలేదు. లక్ష వరకు ర్యాంకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో కాస్త కుదుటపడినట్టే కనిపించింది. ప్రతిరోజూ మాదిరే మంగళవారం ఉదయం కూడా జిమ్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. చాలాసేపయినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు మధ్యాహ్నం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్న సమయంలోనే టీవీ ఛానల్స్‌లో ఓ యువతి అబిడ్స్‌లోని బహుళ అంతస్థుల భవనం నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన తల్లి లవ్లీన్ కౌర్ ఆమె మా బిడ్డే అంటూ కుప్పకూలింది.
జనం చూస్తుండగానే..
జిమ్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరిన జస్లిన్ కౌర్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అబిడ్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్‌కు చేరుకుంది. మెట్లు ఎక్కుతూ పదో అంతస్తుకు వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సరిగ్గా 10.21 గంటల ప్రాంతంలో కిందకు దూకేందుకు సిద్ధమైంది. కింద నుంచి ఆమెను గమనించిన జనం వద్దు వద్దు అంటూ అరుపులు కేకలు పెట్టారు. ఆ తర్వాత 4 నిమిషాలకే జస్లిన్ కిందకు దూకి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు క్షోభ మిగల్చకండి: తల్లిదండ్రులు
జిమ్‌కు వెళ్తానని వెళ్లిన తమ కుమార్తె ఇలా ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదంటూ జస్లిన్ తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు గంపెడు ఆశలు పెట్టుకుంటారని, ర్యాంకులు వచ్చినా, రాకపోయినా ధైర్యంగా ఉండాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకోని క్షోభ మిగల్చవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment