ప్రేమ సుడిలో బాల్యం..!
► రహస్యంగా పెళ్ళి చేసుకున్న ఇద్దరు మైనర్లు
► గర్భవతైన బాలిక
► మైసూరులో కలకలం
మైసూరు: పదహారేళ్ల బాలిక– 17 ఏళ్ల కుర్రాడు ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ ముక్కుపచ్చలారని బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన మైసూరు నగరంలో సంచలనాత్మకమైంది. నగరంలోని ఎన్.ఆర్. మోహల్లాలో ఉన్న కురిమండిలో సోమవారం వెలుగు చూసింది. కురిమండికి చెందిన టెన్త్ బాలికను 17 సంవత్సరాల మైనర్ యువకుడు ప్రేమపేరుతో మభ్యపెట్టి సన్నిహితంగా ఉంటున్నాడు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో 10వ తరగతి చదువుతుండగా, తండ్రి చనిపోవడంతో ఆమె పెద్దమ్మ వద్ద ఉంటోంది.
కుర్రవాడు మైసూరు ప్యాలెస్ ముందు బాగంలో బొమ్మల వ్యాపారం చేసేవాడు. బాలికతో కలిసి కుర్రాడు సినిమాలకు షికార్లకు తిరిగేవాడు. ఇది తప్పని ఎన్నిసార్లు చెప్పినా కూడా బాలిక వినిపించు కోలేదు, దాంతో వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొట్టింది. బాలిక కుర్రాడితో కలిసి దేవాలయానికి వెళ్ళి ఇద్దరు రహస్యంగా పూలదండలు మార్చుకుని ‘పెళ్ళి’ చేసుకున్నారు. దీంతో పరువు పోతుందని భయపడి కుర్రవాని తల్లిదండ్రులు ఇద్దరినీ ఇంటిలోకి రానిచ్చారు.
ఉపాధ్యాయుల ఆరాతో వెలుగులోకి
నెల రోజుల నుంచి పాఠశాలకు బాలిక రాకపోవడంతో సహచర విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు బాలికను రప్పించి విచారించారు. తాను పెళ్ళి చేసుకున్నానని, ప్రస్తుతం మూడు నెలల గర్బవతిని అని అందుకే పాఠశాలకు రావడం లేదని చెప్పడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఈ విషయాన్ని బాలల సహాయవాణికి తెలిపారు. శిశు సంక్షేమ అధికారులు బాలికను విచారించారు. చివరకు ఎన్.ఆర్ మోహల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను బాలల సహాయ కేంద్రానికి, కుర్రాడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు విచారణలో ఉంది.