బళ్లారిలోని సెంట్రల్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న...
సాక్షి, బళ్లారి : బళ్లారిలోని సెంట్రల్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న బిజాపూర్ జిల్లా సింధిగి తాలూకా గుండిగి గ్రామానికి చెందిన రేబన్న (21), అయ్యాళప్ప (23) ప్రహారీ గోడ దూకి చాకచక్యంగా తప్పించుకున్నారు. సెంట్రల్ జైలులో 5-డీ బ్లాకులో ఉంచిన ఈ ఇద్దరు ఖైదీలు కిటికీలు పగులగొట్టి, పంచెలను తాడుగా చేసుకుని ప్రహరీగోడ ఎక్కి (20 అడుగుల ఎత్తు ఉన్న), అక్కడి నుంచి దూకి తప్పించుకుని పరారయ్యారని జైలు అధికారులు తెలిపారు.
బీజాపూర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు హొస్పేటలో హత్య కేసుకు సంబంధించి 2012 నుంచి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలు తప్పించుకున్నారని తెలిసిన వెంటనే జైళ్ల శాఖ డీఐజీ విశ్వనాథయ్య బళ్లారి సెంట్రల్ జైలును తనిఖీ చేశారు. జైలు ప్రహారీ గోడ చుట్టూ కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఖైదీలు పరారయ్యారన్నారు. ఇందుకు బాధ్యులైన విశ్వనాథ్, కృష్ణ హుయిలగోళ అనే ఇద్దరు గార్డులను సస్పెండ్ చేశామన్నారు. ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇలా ఉండగా ప్రహారీ గోడకు విద్యుత్ వైర్లు అమర్చినప్పటికీ, వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతోనే ఖైదీలు పరారయ్యారని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రహారీ గోడకు ఉన్న విద్యుత్ వైర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని పసిగట్టిన ఖైదీలు కట్టుకున్న పంచెలనే తాడుగా ఉపయోగించి తప్పించుకున్నారు. 700 మంది ఖైదీలు జైలులో ఉంటే వారిని కాపలా కాయడానికి ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఎలా కాపలా కాయాలని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఎస్‌పీ చేతన్ సింగ్ రాథోడ్, డీఎస్‌పీలు జైలను పరిశీలించి వివరాలు సేకరించారు. గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.