బనశంకరి: ప్రేమికులందరూ ఎంతో ఆరాటంగా ఎదురుచూసే వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) వచ్చేయడంతో యువతీ యువకుల హృదయాలు తుళ్లిపడుతున్నాయి. మనసైనవారి ముందు తమ ఆకాంక్షను వ్యక్తంచేయడానికి, ఇప్పటికే మనసిచ్చినవారికి ప్రేమ కానుకలతో ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. బళ్లారి, మైసూరు, హుబ్లీ–ధార్వాడ, మంగళూరు తదితర నగరాల్లోనూ ప్రేమికుల రోజు సందడి మొదలైంది. ప్రేమ పేరు, ప్రేమికుల రోజు పేరు తలుచుకున్నా ప్రతీఒక్కరికీ మదిలో ఠక్కున మెదిలేది గులాబీలే. ప్రేమికులు రోజా పూలను ఇవ్వడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడం ఆనవాయితీ అయ్యింది. బుధవారం కోసం గులాబీలకు డిమాండ్ అమాంతం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల గులాబీలకు ఆర్డర్లు రాగా, మరో 42 లక్షల గులాబీ పుష్పాలు విదేశాలకు ఎగుమతైనట్లు సమాచారం.
పార్కులు కిటకిట
ప్రముఖ పార్కులైన కబ్బన్‌పార్క్, లాల్‌బాగ్‌లతో పాటు చిన్నచితకా పార్కులు కూడా ప్రేమ జంటలకు విడిది కాబోతున్నాయి. సాధారణ రోజుల్లో కబ్బన్‌పార్క్, లాల్‌బాగ్‌లలో 300 జంటల వరకు కనిపిస్తే, ప్రేమికుల రోజు ఆ సంఖ్య వెయ్యికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాల్స్, హోటళ్లలోథీమ్ పార్టీల జోరు
వాలంటైన్స్ డే సందర్భంగా నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లు, పబ్‌లలో సరికొత్త థీమ్ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ థీమ్ పార్టీల్లో ప్రేమ జంటల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నాయి. ఒకరి అభిరుచులు, ఇష్టాఇష్టాలపై వారి భాగస్వామికి ఉన్న అవగాహనను పరీక్షించడానికి నిర్వహించే చిన్నపాటి క్విజ్‌లు, తమ తమ జీవితాల్లో మరుపురాని రోజులుగా నిలిచిన తేదీల గురించి ప్రశ్నలు వేయడం లాంటి పోటీలు ఈ థీమ్‌పార్టీలో భాగంగా ఉన్నాయి. ఈ తరహా పోటీల్లో గెలిచిన వారికి రకరకాల బహుమతూల లభిస్తాయి.
కాలేజీల్లోనూ సందడే
నగరంలోని కొన్ని కళాశాలల్లోను వాలంటైన్స్ డే సరదాల సందడి కనిపిస్తోంది. ‘ప్రేమ’ అంటే? ఈ ప్రశ్నకు తమదైన రీతిలో సమాధానం చెప్పాల్సిందిగా కళాశాల యాజమాన్యాలు విద్యార్ధులకు పోటీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్ధులు కూడా ఈ తరహా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రేమకు నిర్వచనాన్ని తమదైన రీతిలో చెబుతున్నారు. కొంతమంది విద్యార్ధులు ఇందుకోసం చిత్రకళను ఎంచుకుంటే, మరికొంత మంది విద్యార్ధులు కుడ్యచిత్రాల ద్వారా తమ సమాధానాలను చెబుతున్నారు. నగరంలోని పలు ఫ్యాషన్ టెక్నాలజీ కళాశాల్లో ఈ తరహా పోటీలనే నిర్వహించారు.
సంఘాల కన్నెర్ర, పోలీసుల భద్రత
ప్రేమికుల రోజు పేరుతో యువతీ, యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారనీ దేశ సంస్కృతికి భంగం కలిగించే కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వరాదని కోరుతూ హిందూ జనజాగృతి సమితి కార్యకర్తలు నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఏటా మాదిరిగా ఈసారి ప్రేమికుల రోజుకు మద్దతుగా వాటాళ్ నాగరాజు ఏం కార్యక్రమం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. వాలెంటైన్స్‌డేను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు ప్రేమ జంటలపై దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో బెంగళూరులో కబ్బన్ పార్క్, లాల్‌బాగ్ పార్కుల్లో సుమారు వంద మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా 30కిపైగా పోలీసుల బృందాలు పహరా కాస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment