అనుబంధాల ‘కలం’ ఆగింది
అస్తమించిన గణేష్ పాత్రో
తమిళ సినిమా : కుటుంబ అనుబంధాలను ఎంతో హృద్యంగా అత్యంత సహజ సిద్ధంగా ఆవిష్కరించే ప్రత్యేక కథా రచయిత గణేష్ పాత్రో సోమవారం చెన్నైలో కన్నుమూశారు. 69 ఏళ్ల ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బాల్యం నుంచి కథలు రాయడం, నాటకాల్లో నటించడం అలవరచుకున్న గణేష్ పాత్రో స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీ పురంలో 1945 జూన్ 22న ఆదిలక్ష్మీనారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు ఆయన జన్మించారు. ఈ దంపతులకు 17 మంది సంతానంలో పెద్ద వాడు గణేష్‌పాత్రో.
ఈయన అసలు పేరు వేహ్రా సత్య గణ గంగ పోలీసు వెంకటరమణ మహా పాత్రో. బీఏ పట్టదారుడైన ఆయనకు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే చిత్ర రంగంలోకి వచ్చారు. నాటకాలు రాయడం, నటించడంపై మక్కువ చూపించే గణేష్ పాత్రోకు ప్రముఖ రంగ స్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వరరావు నటన కంటే రచనలపై దృష్టి సారించాలని సలహా ఇవ్వడంతో పలు కథలను రచించా రు. పావల, కొడుకు పుట్టాల, ఆలోచించండి వంటి పలు నాటకాలను ఆయన రచిం చారు. తొలి నాటకం కొడు కు పుట్టాలకు జాతీయ అవార్డు రావడం విశేషం. ఈ నాటకం పలు భాష ల్లో అనువాదం అయిం ది. రేడియోల్లోనూ ప్రసారం అయింది.
సినీ ప్రస్తానం
గణేష్ పాత్రో సినీ రంగ ప్రస్తానం 1965లో మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని అయిన గణేష్ పాత్రో ఆయనలాగే నటించాలని ఆశపడే వారట. అయితే, ఆయన రాసిన పావల, కొడుకు పుట్టాల నాటకాల సమ్మేళనంతో మాకు స్వతంత్రం కావాలి అనే చిత్రాలను తెరకెక్కించారు. కృష్ణం రాజు, జయ ప్రద హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. అలా, కథా రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన గణేష్‌పాత్రో 125కు పైగా చిత్రాలకు కథలు, మాటలను అందించారు.
బాలచందర్‌తో అనుబంధం
దివంగత ప్రఖ్యాత దర్శకుడు కే బాల చందర్‌తో గణేష్‌పాత్రో అనుబంధం విడదీయరానిది. ఆయన చేసిన ప్రతి చిత్రానికి తెలుగులో గణేష్‌పాత్రో సంభాషణలు అందించారు. వారి మధ్య మంచి సాన్నిహిత్యానికి ఇదొ క నిదర్శనం. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర, గుప్పెడు మనసు,ఆకలి రాజ్యం, రుద్ర వీణ, ఇది కథకాదు లాంటి పలు చిత్రాలు గణేష్‌పాత్రోకి మంచి పేరుతెచ్చి పెట్టాయి. బాలచందర్ అస్తమించిన వెళ్లిన రెండు వారాల్లోనే గణేష్‌పాత్రో కలం ఆగిపోవడం సినీరంగానికి తీరని లోటు.
కోడి రామకృష్ణతో 40 చిత్రాలు
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ, గణేష్‌పాత్రోల కలయికలో 40 చిత్రాలు తెరకెక్కడం విశే షం. ముఖ్యంగా భార్గవ ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత దివంగత ఎస్ గోపాల్ రెడ్డికి ఆస్థాన రచయితగా గణేష్‌పాత్రో వ్యవహరించారు. అలాగే, ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్‌తో కలసి ప లు చిత్రాలకు పనిచేశారు. మనిషికో చరిత్ర, మయూరి, ప్రేమించి పెళ్లాడు, నాట్య మయూ రి, అత్తవారిళ్లు, స్వాతి, చిలకమ్మ చెప్పింది, వం టి ఎన్నో చిత్రాలు రచయితగా గణేష్‌పాత్రోకు కలికి తురాయిగా మిగిలాయి. మంచి సంభాషణలేగానీ, పంచ్ డైలాగులు రాయన న్న నిబద్ధతతో మానవత విలువలకు అద్దం పట్టే చిత్రాలను చేసిన గణేష్‌పాత్రో చివరి చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావడం విశేషం.
నంది అవార్డులు
గణేష్‌పాత్రో స్వాతి చిత్రానికి 1983లో, రుద్రవీణ చిత్రానికి గాను 1988లో ఉత్తమ నంది అవార్డులను అందుకున్నారు. మయూరి చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును దక్కించుకున్నారు. 2009లో ఆయన అభిమానంగా ప్రేమించే అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని, 2013లో మనసు కవి ఆత్రేయ బిరుదును అందుకున్నారు. గణేష్‌పాత్రోకు భార్య లక్ష్మికుమారి, కుమార్తెలు కనకమహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారామ పాత్రో తదితరులు ఉన్నా రు. గణేష్‌పాత్రోకు తొలి రోజుల్లోనే దర్శకత్వ అవకాశం వచ్చినా, అని వార్య కారణాలతో తెరరూపం దాల్చ లేదు. కుటుంబ సభ్యులతో కలసి విశాఖ పట్నంలో నివశించాలన్న కోరిక ఆయనకు ఉన్నా, అది నెరవేరకుండానే అందరికీ దూరమయ్యారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కన్నీటి వీడ్కోలు
గణేష్‌పాత్రో భౌతిక కాయానికి ఆప్తులు, కుటుంబీకులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన భౌతిక కాయాన్ని నందనం సమీపంలోని నివాసంలో ఉంచారు. ప్రముఖ నటుడు గొల్లపుడి మారుతీ రావు తనయుడు సుబ్బారావు తదితరులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇంటి నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఊరేగింపుగా టీ నగర్ కన్నమ్మ పేట శ్మశాన వాటికకు చేర్చారు. తనయుడు సీతారామ పాత్రో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.