పోలీస్ స్టేషన్‌లో మందు.. విందు
- కర్ణాటకలో ఘనకార్యం
- సోషల్ మీడియాలో వైరల్
- ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్
శివాజీనగర్(కర్ణాటక): ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన పోలీస్ స్టేషన్‌ను సిబ్బంది బార్‌గా మార్చేసిన వైనం కర్ణాటకలోని విజయపుర(బీజాపూర్)జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో పోలీస్ శాఖ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. విజయపురలోని జలనగర పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ బుధవారం ఉదయం మద్యం తాగి మత్తులో ఊగడం ప్రారంభించారు.
ఏఎస్‌ఐ మాళిగావ్, కానిస్టేబుల్ సొడ్డి ప్రకాశ్ అక్కితో పాటు మరోఇద్దరు బయటి వ్యక్తులు స్టేషన్‌లో తాగి తందనాలాడారు. వీరికి ఒక మహిళా కానిస్టేబుల్ మద్యం సరఫరా చేయటం గమనార్హం. స్టేషన్ ఆవరణలో సందర్శకులు కూర్చోవడానికి వేసిన కుర్చీలపైనే తాపీగా కూర్చుని మందు, నీళ్లు, సోడా సీసాలు, నంజుకోవడానికి చిరుతిళ్లు పెట్టుకుని మజా చేశారు.
పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కల్యాణ మంటపం నుంచి ఊరగాయ, బజ్జీలు కూడా తెప్పించుకున్నారు. దీన్నంతా ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఖాకీల ఘనకార్యం వెలుగుచూసింది. జిల్లా ఎస్పీ కుల్‌దీప్ జైన్ స్పందించి మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి దీనిపై విచారణకు ఆదేశించారు.