ఏ పార్టీకీ మద్దతు లేదు
సినీ హీరో విజయ్
చెన్నై: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓట్లు రాబట్టుకోవడానికి ఎవరికి వారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రేక్షక ఆకర్షణ మెండుగా గల సినీ తారలను ఉపయోగించుకోవడంలోనూ ఆయా పార్టీలు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు తమకు అనుకూల పార్టీల తరఫున ప్రచారాల్లో ముని గిపోయారు.
చెన్నైలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంత అభిమానులు కలిగిన హీరో విజయ్. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. విజయ్ అభిమానులు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అఖిల భారత ఇళయదళపతి విజయ్ మక్కళ్ కట్చి సోమవారం ఒక ప్రకటన విడుదల చేయడం విశేషం.
అందులో విజయ్ మక్కళ్ కట్చి రాను న్న శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపకుండా మధ్యంతరంగా వ్యవహరిస్తుందన్నారు. ఒక పార్టీకి విజయ్ అభిమానులు మద్దతు ఇస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆయన అభిమానులు ఎవరికి ఇష్టమైన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చుని తెలిపారు. అయితే విజయ్ పేరును గానీ, ఇయక్కమ్ పేరును గానీ వాడరాదన్నారు. అలా వాడుకుంటే ఇయక్కమ్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు.
ఇక ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఇంతవరకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు.
ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం.