చెన్నై: దళపతి విజయ్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పార్టీని రద్దు చేసినట్టు ప్రకటించారు. ఈ పరిణామాలతో తండ్రి, తనయుడి మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. తన కుమారుడైన హీరో విజయ్ పేరిట గతంలో దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ మక్కల్ ఇయక్కంను ఏర్పాటు చేశారు. అభిమాన సంఘాల్ని ఏకం చేసి విజయ్ మక్కల్ ఇయక్కం గొడుగు నీడలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
అదే సమయంలో తనయుడిని రాజకీయాల్లోకి తీసుకు రావడమే లక్ష్యంగా చంద్రశేఖర్ వ్యూహాలకు పదునుపెట్టారు. అయితే, తండ్రి వ్యూహాలకు చిక్కకుండా విజయ్ జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ తన పేరిట తండ్రి చంద్రశేఖర్ ఓ పార్టీని ప్రకటించడం విజయ్ లో ఆగ్రహాన్ని రేపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి విజయ్ అభిమాన సంఘం నేతలు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీశాయి.
ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభతో పాటుగా 11 మందిపై హైకోర్టులో విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు ఇకపై తన పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓ కీలక తీర్మానం చేశామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ మేరకు విజయ్ మక్కల్ ఇయక్కంను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్ తదుపరి విచారణ అక్టోబరు 29కి వాయిదా పడింది.
చదవండి: పేరును వాడుతున్నారని తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో
Comments
Please login to add a commentAdd a comment