చీలికే లక్ష్యం | Vijayakanth can't fire us from DMDK :Chandrakumar MLA | Sakshi
Sakshi News home page

చీలికే లక్ష్యం

Published Thu, Apr 7 2016 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

చీలికే లక్ష్యం

చీలికే లక్ష్యం

కన్నీళ్లు పెట్టిన చంద్రకుమార్
 పెరుగుతున్న మద్దతు
 కెప్టెన్‌కు తప్పని షాక్‌లు
  కేడర్‌ను దక్కించుకునేందుకు పరుగు
 నేతలతో విజయకాంత్ సమాలోచన
 తొమ్మిది మంది ఎమ్మెల్యేల డుమ్మా

 
 సాక్షి, చెన్నై : డీఎండీకేను చీల్చేందుకు బహిష్కృత నేత చంద్రకుమార్ సిద్ధమవుతున్నారు. మద్దతు గణంతో డీఎండీకేను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు వేగం వంతం చేశారు. అసంతృప్తి వాదుల్ని ఏకం చేసి డీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కార్యచరణతో ముందుకు వెళుతున్నారు.  మెజారిటీ బలంతో ఎన్నికల కమిషన్ ఎదుట తమదే నిజమైన డీఎండీకే అని చాటుకుని ఢంకా చిహ్నాన్ని తన్నుకెళ్లే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇక చంద్రకుమార్ స్పీడ్‌కు కళ్లెం వేయడానికి విజయకాంత్ సైతం తీవ్ర కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. అందుబాటులో ఉన్న నాయకులతో సమాలోచనలో మునిగారు.
 
 డీఎండీకేలో తిరుగుబాటు బయలుదేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి, అసెంబ్లీ విప్ చంద్రకుమార్ నేతృత్వంలో శేఖర్, పార్తిబన్ తదితర ఎమ్మెల్యేలతో పాటుగా పది మంది జిల్లాల కార్యదర్శులు తిరుగు బాటు ధోరణి అనుసరించడంతో వారికి విజయకాంత్ ఉద్వాసన పలికారు.  ఈ పరిణామాలతో  ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో డీఎంకేలోకి వలసలు బయలు దేరినట్టే అన్న  సంకేతాలు బయలు దేరాయి. అయితే, తమది డీఎంకే బాట కాదని, డీఎండీకేను చీల్చడం, తదుపరి కైవసం లక్ష్యం అన్న నినాదాన్ని చంద్రకుమార్ బృందం అందుకునేందుకు సిద్ధం అవుతుండడం చర్చనీయాంశంగా మారి ఉన్నది.
 
 ఇందుకు తగ్గట్టుగానే వారి వ్యవహారాలు ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు.  తమను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చంద్రకుమార్, మద్దతు సమీకరణతో  ఒకటి రెండు రోజుల్లో పార్టీని చీల్చబోతున్నారు. అనంతరం పోటీ సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో తీసుకునే నిర్ణయం మేరకు డీఎండీకేను  కైవ సం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
 అదే సమయంలో పార్టీ ప్రస్తుతం ప్రేమలత గుప్పెట్లో ఉందని, ఆమె రూపంలో సర్వనాశనం అవుతున్న పార్టీని, కేడర్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రకుమార్ స్పందించడం ఆలోచించాల్సిందే. పార్టీ కైవసంతో తమ మెజారిటీని ఎన్నికల యంత్రాంగం ఎదుట చాటుకుని డీఎండీకే చిహ్నం ఢంకాను సైతం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. తదుపరి డీఎంకేతో కలసి బరిలోకి దిగేందుకు తగ్గ వ్యూహంతో చంద్రకుమార్ బృందం దూకుడు పెంచి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 కన్నీళ్లు పెట్టిన చంద్రకుమార్:
  బుధవారం మైలాపూర్‌లో తన మద్దతు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులతో కలసి చంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా తాము డీఎండీకేలోనే ఉన్నామని, కెప్టెన్ చిత్ర పటాన్నే తమ జేబుల్లో పెట్టుకుని ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం డీఎండీకే వదినమ్మ ప్రేమలత గుప్పెట్లోకి చేరిందని, అందుకే తాము గళం విప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
 
 తమ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటే వివరణ కోరాల్సి ఉందని, క్రమ శిక్షణ చర్యలు తప్పని సరి అన్నప్పుడు కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. అయితే, ఆ కమిటీలో ఉన్న వాళ్లల్లో ఎక్కువ శాతం మంది ఇక్కడే ఉంటే, ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తమ కెప్టెన్ కు ఇష్టం లేకున్నా, బలవంతంగా  ప్రజా సంక్షేమ కూటమిలోకి ప్రేమలత చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
   జేబులు, ఇళ్లు గుళ్ల అయ్యాయని, ఆస్తులు పార్టీ కోసం కరిగి పోయాయని, అద్దె ఇళ్లల్లో భారాన్ని మోస్తున్న తాము మళ్లీ మళ్లీ కష్టాల్ని చవి చూడదలచుకోలేదని ఈసందర్భంగా చంద్రకుమార్ కన్నీళ్లు పెట్టడం మీడియా సమావేశంలో  ఉద్వేగభరిత  వాతావరణం నెలకొంది. తానేదో ఎవరో ఇచ్చే నోట్లకు ఆశ పడి తిరుగు బావుటా ఎగుర వేయలేదని, పదవుల కోసం వెంపర్లాడం లేదని, మహోన్నత ఆశయంతో డీఎండీకే ఆవిర్భవించిందని, దానిని, కేడర్‌ను  రక్షించుకోవాలన్న లక్ష్యంతో ఈ తిరుగుబాటు అని కన్నీళ్ల పర్యంతంతో వ్యాఖ్యలు చేశారు.
 
  ఎండీఎంకే నేత వైగో అనుచితంగా తమ మీద వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ పార్టీ అంతర్యగత  విభేదాలు, వ్యవహారాల్లో  జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని వైగోను హెచ్చరించారు. డీఎంకే నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే  వద్ద ఎన్ని కోట్లు తీసుకుని ఎండీఎంకేను పెట్టావు..? అని తాము ప్రశ్నించాల్సి ఉంటుందని మండి పడ్డారు.
 
 అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించి వైగో, ఇప్పుడు డీఎండీకేను సర్వనాశనం చేయడానికి సిద్ధం అయ్యారని,అందుకే పార్టీని రక్షించుకుంటాం అంటూ పరోక్షంగా ఇక కైవసం తదుపరి అన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. అలాగే, ఒకటి రెండు రోజుల్లో మద్దతు చాటుకుంటామని, తదుపరి తమ నిర్ణయాల్ని ప్రకటిస్తామంటూ దూకుడు పెంచే పనిలో పడ్డారు. అదే సమయంలో చంద్రకుమార్ వెంట నడిచేందుకు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, 20 మంది జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడంతో ఇక, డీఎండీకేను చేజిక్కించుకుంటారా..?అన్న ఉత్కంఠ నెలకొంది.
 
 కెప్టెన్ సమాలోచన :
 చంద్రకుమార్ బృందం దూకుడు కల్లెం వేసి కేడర్‌ను దక్కించుకునేందుకు విజయకాంత్ రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేల్ని ఆగమేఘాలపై చెన్నైకు పిలిపించారు. అయితే, తొమ్మిది మంది ఎమ్మెల్ల్యేలు ఇరవై జిల్లాలకు చెందిన కార్యదర్శులు, మరికొందరు నాయకులు ఈ సమావేశానికి డుమ్మాకొట్టారు.
 
  అయినా, వచ్చిన వారితో సమాలోచించి, కేడర్‌ను దక్కించుకునేందుకు తగ్గ వ్యూహ రచనల్లో పడ్డారు. చాలా రోజులుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న విజయకాంత్, మధ్యాహ్నం కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని తనతో కలిసి వచ్చే వారితో సమాలోచనలో మునిగారు. ఇక, చంద్రకుమార్ అండ్ బృందం పై కెప్టెన్ వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు పార్థసారథి, ఎ.మురుగేషన్ తీవ్రంగా స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement