కెప్టెన్ కసరత్తు
రాష్ర్ట పర్యటనకు నిర్ణయం
బలోపేతం లక్ష్యంగా పయనం
సాక్షి, చెన్నై: చతికిలపడ్డ డీఎండీకేను బలోపేతం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ కసరత్తుల్లో పడ్డారు. పార్టీల నేతలతో సమీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20 వరకు ఈ సమీక్షలు సాగనున్నాయి. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బలోపేతం లక్ష్యంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో ఈ పర్యటనకు చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అన్నంతగా ఎదిగిన నేత విజయకాంత్.
డీఎండీకే ఆవి ర్భావంతో సత్తా చాటి, ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి చివరకు చతికిలబడ్డారు. ఎంత వేగంగా ఎదిగారో, అంతే వేగం గా పాతాళంలోకి నెట్టబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఉండి ఉంటే, కెప్టెన్‌ను ప్రజలు ఆదరించి ఉంటారేమో. కింగ్ అంటూ ముందుకు సాగి ఆరుగురితో కలసి డీఎంకే, అన్నాడీఎంకే అనే ఇద్దర్ని వేర్వేరుగా ఢీ కొట్టి చివరకు అడ్రస్సు గల్లంతు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయకాంత్ చరిష్మా అంటే ఇది అని చెప్పుకున్న వాళ్లంతా, ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు సంధించే పనిలో పడ్డారు.
డిపాజిట్లు గల్లంతై, ఓటు బ్యాంక్ కోల్పోయి దీనావస్థలో ఉన్న పార్టీకి కొత్త ఉత్సాహం నింపడం ఇప్పుడు విజయకాంత్ ముందు ఉన్న పెద్ద సవాల్. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా తీవ్ర కసరత్తులకు సిద్ధం అయ్యారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నియోజకవర్గ స్థాయిల్లోని నేతలతో సమీక్షించి, మళ్లీ బలనిరూపణ లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తీరుపై సమీక్షించే పనిలో పడ్డారు. ఆ మేరకు సమీక్షలకు సోమవారం శ్రీకారం చుట్టారు. చెన్నై కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో తొలి రోజు చెన్నై, తిరువళ్లూరు జిల్లాల నేతలతో సమీక్షించారు.
వార్డు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ప్రస్తుతం పార్టీ పరిస్థితి, వెన్నంటి ఉన్న కేడర్, నాయకుల వివరాలను సేకరించారు. పార్టీలో ప్రక్షాళన పర్వంతో ముందుకు సాగితే, కొత్త రక్తం నింపినట్టు అవుతుందన్న అంశాన్ని నాయకుల ముందు ఉంచి వారి అభిప్రాయాల్ని సేకరించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని, అధికార పూర్వకంగా ప్రజా సంక్షేమ కూటమికి టాటా చెప్పే ప్రకటన విడుదల చేయాలని విజయకాంత్‌ను నాయకులు పట్టుబట్టి ఉన్నారు.
ఇందుకు సానుకూలంగానే విజయకాంత్ స్పందించినట్టు, ఆ కూటమితో పని లేకుండా, పార్టీ బలం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుదామని నేతలకు సూచించి ఉన్నారు. ఈ సమీక్షలు 20వ తేదీ వరకు సాగించే రీతిలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. మంగళవారం తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు.
ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విజయకాంత్ పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో రోజుకు ఒక జిల్లా చొప్పున ఎంపిక చేసుకుని, మూడు నాలుగు ప్రధాన నియోజకవర్గ కేంద్రాల్లో సంక్షేమ సామగ్రి పంపిణీ, బహిరంగ సభలతో బలాన్ని చాటుకోవడం, ఢీలా పడ్డ కేడర్‌లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా విజయకాంత్ పర్యటన సిద్ధం అవుతోన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.