
ఎన్నికల్లో లంచం ఇస్తే... డీడీతో చెప్పు దెబ్బ
చెన్నై : తమిళనాడు ఓటరు శ్రీరంగం అభ్యర్థులకు తన తడాఖా చూపించాడు. ఉప ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చిన సొమ్మును ఎన్నికల కమిషన్‌కు అప్పగించాడు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఉప ఎన్నిక సందర్భంగా గత నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో యథేచ్ఛగా నగదు, బహుమానాలు పంపిణీ జరిగినట్లు అభ్యర్థులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఎన్నికలో అన్నాడీఎంకే భారీ మెజారిటీతో గెలుపొందింది. ఓటర్లను మభ్యపెట్టిన ట్లు వచ్చిన ఆరోపణలపై కొందరిపై ఆనాడే ఈసీ కేసులు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ఒక ఓటరు, శ్రీరంగం ఎన్నికల్లో ఓటు కోసం తన కుటుంబానికి నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు రూ.12 వేల డిమాండ్ డ్రాఫ్ట్‌ను పంపాడు. ఆరుగురు సభ్యులు కలిగిన తన కుటుంబానికి ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.12 వేలు చెల్లించారని ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని 10 మంది వ్యక్తులు గత నెల 9వ తేదీన బలవంతంగా తనకు అందజేసినట్లుగా అతను వివరించాడు. ఈ ఫిర్యాదును సీఈసీ విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక పంపాల్సిందిగా తిరుచ్చి పోలీస్ సూపరింటెండెంట్‌ను ఆదేశించగా మూడు సెక్షన్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.