సాక్షి, ముంబై: ‘లోక్‌సభ ఎన్నిల్లో ఘన విజయం సాధించి ఢిల్లీకి వెళ్లాం. ఇంతటితో హిందు హృదయ సామ్రాట్ దివంగత బాల్‌ఠాక్రే కల నెరవేరలేదు. అసెంబ్లీ భవనంపైనా కాషాయజెండా రెపరెపలాడాలి. అప్పుడే ఆయన కల నెరవేర్చినట్టు అవుతుంది’ అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమికి భారీ మెజారిటీ వచ్చింది. పార్టీకి 18 ఎంపీ సీట్లు రావడానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి సేన జల్లోష్ పేరుతో ప్రత్యేక ఉత్సవం నిర్వహించింది. అంధేరిలోని శహాజీరాజే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం రాత్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శివసేన తరఫు నుంచి గెలిచిన మొత్తం 18 ఎంపీలను ఇదే వేదికపై సత్కరించారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ విజయానికి ప్రధాన కారకుడిని తానేనని అందరూ అంటున్నారని, కానీ ఈ విజయం లక్షలాది మంది శివసైనికుల కృషివల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ఒక సవాల్‌గా తీసుకొని చివరకు విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. ఆదిత్య ఠాక్రే నేతృత్వంలోని యువసేన కూడా పార్టీ గెలుపు కోసం ఎంతగానో శ్రమించిందని ప్రశంసించారు. రాష్ట్రం నుంచి 18 శివసేన పులులు (ఎంపీలు) ఢిల్లీకి వెళ్లాయి కాబట్టి ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ముంబైతోపాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఉద్ధవ్ అన్నారు. ముంబైని తప్పకుండా అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరాన్ని పట్టిపీడిస్తున్న ట్రాఫిక్‌జామ్ సమస్య పరిష్కారం, కోస్టల్ రోడ్డు నిర్మాణం, నగరానికి తాగు నీరు సరఫరా చేస్తున్న జలాశయాలు, పైపులైన్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఉద్ధవ్ ప్రసంగానికి ముందు పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు.
ఉద్ధవ్ సతీమణి రష్మీ ఠాక్రే, తనయులు ఆదిత్య ఠాక్రే, తేజస్ ఠాక్రే, సీనియర్ నాయకులు మనోహర్ జోిషీ, గజానన్ కీర్తికర్, రాహుల్ శేవాలే, మేయర్ సునీల్ ప్రభు, ఠాణే మేయర్ హరిశ్చంద్ర పాటిల్, బీజేపీకి చెందిన పూనం మహాజన్, గోపాల్ శెట్టి, బీజేపీ ముంబై ప్రదేశ్ అధ్యక్షుడు ఆశిష్ శేలార్, ఆర్పీఐ నాయకులు అవినాశ్ మాతేకర్, వికాస్ మహాత్మే తదితరులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
అసెంబ్లీలోనూ జెండా మాదే
Published Mon, Jun 2 2014 10:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement