మాఫియా ‘జల’గ
Published Sat, Jan 4 2014 10:51 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
రాజధానిని నీటి మాఫియా జలగలా పట్టుకుంది. కొరతను అదనుగా చేసుకుని నగరవాసులను వీరంతా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఐదు వేల లీటర్ల నీటిని రూ. 3,000లకు, 12 వేల లీటర్ల నీటిని ఐదు నుంచి పది వేల రూపాయలదాకా విక్రయిస్తున్నారు. మరోమార్గం లేకపోవడంతో నగరవాసులు కొనుగోలు చేయకతప్పడం లేదు.
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో వాటర్ ట్యాంకర్ మాఫియా రాజ్యం నడుస్తోంది. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) అధికారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నగరవాసులను దోచుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో మున్ముందు తమకు అనుకూలమైన పరిస్థితి ఉండకపోవచ్చనే భయం వారిని ప్రస్తుతం వెంటాడుతోంది. కొద్దినెలలుగా నీటి మాఫియా రాకెట్ గుట్టుగా నడుస్తోంది. సాధారణంగా వేసవికాలంలో వీరి కార్యకలాపాలు జోరుగా జరుగుతాయి. అయితే ఈసారి అసాధారణరీతిలో చలికాలాన్ని కూడా వీరు విడిచిపెట్టలేదు. నగరంలోని అత్యంత విలాసవంతమైన కాలనీల్లో నీటి మాఫియా కృత్రిమ నీటి సంక్షోభాన్ని సృష్టించింది. మరోవైపు కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని ప్రతి గడపకు ప్రతి రోజూ 700 లీటర్ల నీటిని ఉచితంగా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. కాగా కృత్రిమ కొరత సృష్టించిన ప్రాంతాల్లో నివసించేవారు వెయ్యి లీటర్ల నీటి కోసం రూ. 800 నుంచి రూ.1,500 వరకూ చెల్లించకతప్పడం లేదు.
గతంలో వీరంతా ఇదే మొత్తం పరిమాణానికి రూ. 400 నుంచి రూ. 800 చెల్లించేవారు. ఇక 5000 లీటర్ల నీటిని రూ. 3,000లకు, 12 వేల లీటర్ల నీటిని రూ. 5,000 నుంచి రూ. 10,000 దాకా నీటి మాఫియా విక్రయిస్తోంది. ఇక హోటళ్లు, ఆస్పత్రులు వంటి పెద్ద పెద్ద సంస్థలకు భారీ పరిమాణంలో నీరు అవసరమవుతుంది. ఇటువంటి వారు 24 వేల లీటర్ల నీటిని కొనుగోలు చేయాలంటే అందుకోసం రూ. 10 వేలు చెల్లించాల్సిందే.నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల గొట్టపుబావుల నుంచి ప్రతిరోజూ 2,000లకు పైగా ప్రైవేటు ట్యాంకర్లు నీటిని సేకరిస్తున్నాయి. దీంతోపాటు అక్కడక్కడా డీజేబీ కనెక్షన్లనుంచి కూడా సేకరించిన నీటిని వినియోగదారులకు విక్రయిస్తున్న ప్రైవేటు ట్యాంకర్ మాఫియా.. కొనుగోలుదారుల వద్దను ంచి అసాధారణ చార్జీలను వసూలు చేస్తున్నాయి. వినియోగదారుల ముక్కుపిండి తమ జేబులు నింపుకుంటున్నాయి. నైరుతి, ఆగ్నేయ ఢిల్లీలతోపాటు దక్షిణ ఢిల్లీలోనూ నీటి మాఫియా కార్యకలాపాలు జోరుగా జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నేతల హస్తం?
కాంగ్రెస్ నాయకుల కుమ్మక్కు కారణంగానే నీటి బ్లాక్ మార్కెటింగ్ జోరుగా జరుగుతోందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదిలాఉంచితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు కొత్తగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ నగరవాసులకు నీటిని ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి దాదాపు వారం రోజులు గడిచిపోయింది. గతంలో ఏసియాడ్ విలేజ్‌లోని అప్ మార్కెట్ ప్రాంతంలో నివసించేవారికి ప్రతిరోజూ నీరు అందేది. అయితే ఆప్ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంటుండడంతో ఆ పరిసరాలు ఎండిపోయాయి. వాస్తవానికి ఇందులో ఆప్ ప్రభుత్వం తప్పేమీ లేదని, ప్రైవేటు ట్యాంకర్లు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) అధికారులు కుమ్మక్కవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. గడచిన ఐదారు రోజుల నుంచి తమకు నీరు అందడం లేదని ఏసియాడ్ విలేజ్‌వాసులు వాపోతున్నారు.
‘ఇటువంటి పరిస్థితిని మేము గతంలో ఏనాడూ ఎదుర్కోలేదు. ఆరు రోజుల తర్వాత మాకు నీరు అందింది’ అని కస్టమ్స్ శాఖ మాజీ అధికారి అజయ్ అగ్నిహోత్రి తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నం కారణంగా నీరు ఇతర ప్రాంతాలకు మరలిపోతోందా అని ప్రశ్నించగా డీజేబీ అధికారుల కుట్ర వల్లనే ఈవిధంగా జరుగుతోందన్నారు. ‘కొత్త ప్రభుత్వానికి డీజేబీ అధికారులు వెన్నుపోటు పొడుస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. తనకు ఒకవేళ 700 లీటర్ల నీరు ఉచితంగా అందినప్పటికీ సాధ్యమైనం తక్కువ మోతాదులోనే వాడుకుంటానన్నారు. ఇదే అంశంపై ఆప్ మీడియా సమన్వయకర్త దీపక్ బాజ్‌పేయి మాట్లాడుతూ ఇటువంటి ఫిర్యాదులు దృష్టికి రాగానే తనతోపాటు తమ పార్టీకి చెందిన శాసనసభ్యుడితో కలసి పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రాంతంలో డీజేడీ అధికారులు ప్రైవేటు ట్యాంకర్ల యజమానులతో కుమ్మక్కయ్యారన్నారు. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్నారు.
మాకు నీళ్లు రావడం లేదు
తమ సొసైటీకి నీళ్లు రావడం లేదని ఓ కంపెనీలో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న హేమంత్ ముద్గల్ వాపోయారు. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను కిరాయికి తీసుకుని నీటిని తెప్పించుకోగలుగుతున్నారని, అయితే తాము ప్రతిరోజూ నీటి కోసం పోరాటం చేయకతప్పడం లేదన్నారు. మొత ్తం 365 రోజులకుగాను కనీసం సగం రోజులు కూడా నీరు రావడం లేదన్నారు. అందువల్ల తమకు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. కాగా చలికాలంలోనూ ఏసియాడ్ విలేజ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం వారు నానాఅగచాట్లు పడుతున్నారు. నగరానికి ఓ షో పీస్‌లా భావించే ఏసియాడ్ విలేజ్‌లో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు సగటున రూ. 10 కోట్ల దాకా ఉంటుంది. వీటన్నింటికీ డీజేబీ కనెక్షన్లు ఉన్నాయి. అయినా వారి కష్టాలు తీర్చేవారు మాత్రం కనిపించడం లేదు. ఏసియాడ్ క్రీడల సందర్భంగా 1982లో ఈ విలేజ్‌ని ప్రభుత్వం నిర్మించింది. ఇందులో మొత్తం 853 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ నివసించేవారిలో 750 మంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఎయిమ్స్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ నీరు సరిగా రాకపోతుండడంతో డీజేబీనుంచి ప్రతిరోజూ ప్రత్యేకంగా తె ప్పించుకోక తప్పడం లేదు.
ఆరు ట్యాంకర్లను పంపిస్తున్నాం
ఏసియాడ్ విలేజ్‌కి ప్రతిరోజూ ఆరు నీటి ట్యాంకర్లను పంపుతున్నామని ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ప్రతి రోజూ తమకు దాదాపు 30 ఫిర్యాదులు అందుతుంటాయన్నారు. నీటి సంక్షోభం లేదని తాము అనడం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడి మాత్రమే తాము పనిచేయాల్సి ఉంటుందన్నారు.
నిలకడగా ఉండడం లేదు
నీటి కొర త, చార్జీల విషయమై నగరంలోని కల్కాజీ ప్రాంతానికి చెందిన విజయ్ ఓఝా అనే వ్యక్తి మాట్లాడుతూ ‘ నీటి చార్జీలు నిలకడగా ఉండడం లేదు. డిమాండ్ పెరిగితే చార్జీలు వాటంతట అవే పెరుగుతున్నాయి’ అని అన్నారు.
Advertisement
Advertisement