ముంబైకర్లకు అన్యాయం జరిగే ఎలాంటి ప్రతిపాదనలైనా వ్యతిరేకిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
శివసేన అధినేత ఉద్ధవ్
సాక్షి, ముంబై: ముంబైకర్లకు అన్యాయం జరిగే ఎలాంటి ప్రతిపాదనలైనా వ్యతిరేకిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ‘ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)పై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తే ముంబైలో పేదలకు ఇళ్లు కరవైతాయి. ఇళ్ల ధరలు పెరిగి ప్రజలు శివారు ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు’ అని ఉద్ధవ్ చెప్పారు.
బీజేపీ రూపొందించిన ప్రణాళికను అధ్యయనం చేసేందుకు శివసేన కార్పొరేటర్లు, నిపుణులతో మంగళవారం ఉద్ధవ్ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అసలు ప్రణాళిక ఏంటి? దాన్ని ఏ పద్ధతిలో రూపొందించారు? ఎలా అభివృద్ధి చేస్తారు? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పేదలకు అన్యాయం జరిగే ప్రతిపాదనలను తిరస్కరిస్తామని అన్నారు.
అభివృద్ధిని వ్యతిరేకించడం లేదని, అభివృద్ధి వల్ల ఎవరికి, ఎంతమేర నష్టం జరుగుతుంది, దీనికి పరిష్కార మార్గమేంటనే దానిపై దృష్టి సారించాలని సూచించారు.