విజయకాంత్ నిర్ణయం కోసం ఎదురుచూపులు
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిర్ణయం కోసం అనేక పార్టీలు ఎదురు చూస్తున్నాయి. దీంతో కూటమి ఏర్పాటులో జాప్యం ఏర్పడుతోంది. రాష్ట్ర అసెంబ్లీకి మే నెల లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా అభ్యర్థుల ఎంపిక కూడా చేపడుతోంది. 234 నియోజకవర్గాలు తమవేనన్న ధీమాతో ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. మిగతా పార్టీలు కూటములు ఏర్పాటు చేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.
డీఎంకే కూటమి: పెద్ద ప్రతిపక్షపార్టీ అయిన డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య మళ్లీ పొత్తులు కుదిరాయి. డీఎంకే పార్టీ లో ఇదివరకే ఉన్న చిన్నచితకా పార్టీలు ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ డీఎండీకేనూ తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. విజయకాంత్‌కు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ బహిరంగ ఆహ్వానం పలికారు. అయినప్పటికీ విజయకాంత్ తరఫున ఎటువంటి బదులు అందలేదు. విజయకాంత్ కూటమికి అనేక షరతులు విధిస్తున్నారు. వీటిని అంగీకరించే పార్టీతోనే తమ పొత్తని పేర్కొంటున్నారు.
ప్రేమలత విమర్శలు: డీఎంకే, కాంగ్రెస్ కూటమి గురించి విజయకాంత్ భార్య ప్రేమలత విమర్శించడం దీన్ని మలుపు తిప్పింది. ఆమె ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ సాంఘిక మాధ్యమాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చోటుచేసుకోవడం డీఎండీకేకు నచ్చలేదు. బీజేపీ పొత్తు కుదుర్చుకోవాలని డీఎండీకే అభిలషించింది. అయితే కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఇలావుండగా డీఎండీకే తమ వైపే వస్తుందన్న విశ్వాసంతో బీజేపీ ఉంది.
ఇలావుండగా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా సాధించామని, ఢిల్లీ స్థాయిలో తాము పేరుపొందాలన్న రీతిలో డీఎండీకే ప్రయత్నాలు సాగిస్తోంది. ఇలావుండగా డీఎండీకే ఎమ్మెల్యేలు, నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహించడం మంచిదనే ధీమాలో వున్నారు. ఇలావుండగా మక్కల్ నలకూట్టని నేతలు కూడా విజయకాంత్ తమ వైపు వస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల జరుగనున్న కాంచీపురం మహానాడులో కూటమి ప్రకటన చేస్తారా? లేదా సస్పెన్స్‌తోనే వదిలిపెడతారా? అంటూ పలువురు ఎదురుచూస్తున్నారు.