DMDK President vijayakant
-
సంక్షేమ కూటమికి బీటలు
* వైదొలగనున్న డీఎండీకే, తమాకా * అదే దిశగా వామపక్షాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేసుకుంటూ ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. ఎండీఎంకే అధినేత వైగో కూటమి రథసారధిగా, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించారు. అధికారంలోకి రాకున్నా కనీసం పది సీట్లు గెలుచుకుంటామని కూటమి నేతలు ఆశించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో వారి ఆశలు తల్లకిందులయ్యాయి. కనీసం ఒక్కసీటును కూడా గెలుచుకోలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఎంతో అవమానకరంగా డిపాజిట్టు కోల్పోయారు. ఆఖరుకు కూటమిలోని పార్టీలు ఈసీ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమికి నువ్వంటే నువ్వు కారణమని నేతలు వాదించుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటించడం వల్లనే ఘోరపరాజయాన్ని చవిచూశామని వీసీకే అధినేత తిరుమావళవన్ ఫలితాలు వెలువడగానే వ్యాఖ్యానించాడు. కూటమి పార్టీల్లోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని వైషమ్యాలు తలెత్తాయి. కూటమి నుంచి వెంటనే వైదొలగాల్సిందిగా డీఎండీకే జిల్లా కార్యదర్శులు విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి నుంచి వైదొలగడమే మేలని డీఎండీకే, తమాకా నిర్ణయించుకున్నాయి. మూడో కూటమికి ముగింపు పలికి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నిర్ణయించుకున్నాయి. అలాగే వామపక్షాలు సైతం వైదొలగాలనే ఆలోచనలో పడ్డాయి. ఎన్నికల్లో కూటమి ఆశించిన విజయాన్ని అందుకోలేదు, అయితే కూటమి ఏర్పాటైన పదినెలలకే గణనీయమైన ఓట్లు సాధించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణన్ అంటున్నారు. ఘన విజయాన్ని తాము అంచనా వేయలేదు, అయితే ప్రస్తుత పరాజయ పరిస్థితి తాత్కాలికమేనని అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ధనస్వామ్యాన్ని అరికట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. -
విజయకాంత్ నిర్ణయం కోసం ఎదురుచూపులు
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిర్ణయం కోసం అనేక పార్టీలు ఎదురు చూస్తున్నాయి. దీంతో కూటమి ఏర్పాటులో జాప్యం ఏర్పడుతోంది. రాష్ట్ర అసెంబ్లీకి మే నెల లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా అభ్యర్థుల ఎంపిక కూడా చేపడుతోంది. 234 నియోజకవర్గాలు తమవేనన్న ధీమాతో ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. మిగతా పార్టీలు కూటములు ఏర్పాటు చేసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. డీఎంకే కూటమి: పెద్ద ప్రతిపక్షపార్టీ అయిన డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య మళ్లీ పొత్తులు కుదిరాయి. డీఎంకే పార్టీ లో ఇదివరకే ఉన్న చిన్నచితకా పార్టీలు ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ డీఎండీకేనూ తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. విజయకాంత్‌కు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ బహిరంగ ఆహ్వానం పలికారు. అయినప్పటికీ విజయకాంత్ తరఫున ఎటువంటి బదులు అందలేదు. విజయకాంత్ కూటమికి అనేక షరతులు విధిస్తున్నారు. వీటిని అంగీకరించే పార్టీతోనే తమ పొత్తని పేర్కొంటున్నారు. ప్రేమలత విమర్శలు: డీఎంకే, కాంగ్రెస్ కూటమి గురించి విజయకాంత్ భార్య ప్రేమలత విమర్శించడం దీన్ని మలుపు తిప్పింది. ఆమె ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ సాంఘిక మాధ్యమాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చోటుచేసుకోవడం డీఎండీకేకు నచ్చలేదు. బీజేపీ పొత్తు కుదుర్చుకోవాలని డీఎండీకే అభిలషించింది. అయితే కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఇలావుండగా డీఎండీకే తమ వైపే వస్తుందన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. ఇలావుండగా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా సాధించామని, ఢిల్లీ స్థాయిలో తాము పేరుపొందాలన్న రీతిలో డీఎండీకే ప్రయత్నాలు సాగిస్తోంది. ఇలావుండగా డీఎండీకే ఎమ్మెల్యేలు, నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహించడం మంచిదనే ధీమాలో వున్నారు. ఇలావుండగా మక్కల్ నలకూట్టని నేతలు కూడా విజయకాంత్ తమ వైపు వస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల జరుగనున్న కాంచీపురం మహానాడులో కూటమి ప్రకటన చేస్తారా? లేదా సస్పెన్స్‌తోనే వదిలిపెడతారా? అంటూ పలువురు ఎదురుచూస్తున్నారు.