సంక్షేమ కూటమికి బీటలు
* వైదొలగనున్న డీఎండీకే, తమాకా
* అదే దిశగా వామపక్షాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేసుకుంటూ ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. ఎండీఎంకే అధినేత వైగో కూటమి రథసారధిగా, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించారు.
అధికారంలోకి రాకున్నా కనీసం పది సీట్లు గెలుచుకుంటామని కూటమి నేతలు ఆశించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో వారి ఆశలు తల్లకిందులయ్యాయి. కనీసం ఒక్కసీటును కూడా గెలుచుకోలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఎంతో అవమానకరంగా డిపాజిట్టు కోల్పోయారు. ఆఖరుకు కూటమిలోని పార్టీలు ఈసీ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమికి నువ్వంటే నువ్వు కారణమని నేతలు వాదించుకుంటున్నారు.
సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటించడం వల్లనే ఘోరపరాజయాన్ని చవిచూశామని వీసీకే అధినేత తిరుమావళవన్ ఫలితాలు వెలువడగానే వ్యాఖ్యానించాడు. కూటమి పార్టీల్లోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని వైషమ్యాలు తలెత్తాయి. కూటమి నుంచి వెంటనే వైదొలగాల్సిందిగా డీఎండీకే జిల్లా కార్యదర్శులు విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కూటమి నుంచి వైదొలగడమే మేలని డీఎండీకే, తమాకా నిర్ణయించుకున్నాయి. మూడో కూటమికి ముగింపు పలికి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నిర్ణయించుకున్నాయి. అలాగే వామపక్షాలు సైతం వైదొలగాలనే ఆలోచనలో పడ్డాయి. ఎన్నికల్లో కూటమి ఆశించిన విజయాన్ని అందుకోలేదు, అయితే కూటమి ఏర్పాటైన పదినెలలకే గణనీయమైన ఓట్లు సాధించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణన్ అంటున్నారు.
ఘన విజయాన్ని తాము అంచనా వేయలేదు, అయితే ప్రస్తుత పరాజయ పరిస్థితి తాత్కాలికమేనని అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ధనస్వామ్యాన్ని అరికట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.