తాలూకా పరిధిలోని బైరగామదిన్ని గ్రామానికి చెందిన రైతు వీరేష్ (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు ....
సిరుగుప్ప : తాలూకా పరిధిలోని బైరగామదిన్ని గ్రామానికి చెందిన రైతు వీరేష్ (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం రైతు తన ఇంటిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు.
రైతు ఆత్మహత్య ఉదంతం సిరుగుప్ప నియోజకవర్గంలో తీవ్ర విషాదం మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కు అయిన రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బళ్లారి జిల్లాధికారి సమీర్‌శుక్లా, ఇతర అధికారులు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.25 వేల చెక్కును అందజేశారు. బళ్లారి జిల్లాలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.