Viresh
-
ఫేస్బుక్లో ప్రేమాయణం
{పియుడితో వివాహం జరిపించాలని పోలీసులను ఆశ్రయించిన యువతి గంగావతి (కర్ణాటక) : కాల్‌సెంటర్ ఉద్యోగిని, సైనికుడి మధ్య ఫేస్బుక్లో మొదలైన ప్రేమాయణం చివరకు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్న మైసూరుకు చెందిన శ్వేత, ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో సైన్యంలో పనిచేస్తున్న కర్ణాటకలోని కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా, ముట్టాళ్ గ్రామానికి చెందిన వీరేష్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలంగా వీరేష్ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో శ్వేత.. వీరేష్ ఆచూకీ తెలుసుకొని శుక్రవారం కుక్కనూరు పోలీసు స్టేషన్‌కు వచ్చింది. వీరేష్, తాను ప్రేమించుకున్నామని, తమకు వివాహం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు వీరేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేశారు. మూడు నెలలు సమయమిస్తే తాను శ్వేతను వివాహం చేసుకుంటానని వీరేష్ చెప్పారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సిరుగుప్ప : తాలూకా పరిధిలోని బైరగామదిన్ని గ్రామానికి చెందిన రైతు వీరేష్ (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం రైతు తన ఇంటిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు. రైతు ఆత్మహత్య ఉదంతం సిరుగుప్ప నియోజకవర్గంలో తీవ్ర విషాదం మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కు అయిన రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బళ్లారి జిల్లాధికారి సమీర్‌శుక్లా, ఇతర అధికారులు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.25 వేల చెక్కును అందజేశారు. బళ్లారి జిల్లాలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
ఎన్నాళ్లీ వేదన?
ఇంకా లభ్యం కాని సందీప్ ఆచూకీ మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో నీటి ప్రవాహానికి గల్లంతైన సందీప్ తిరిగి వస్తాడని కుటుంబీకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఘటన జరిగి 6 రోజులు గడిచినా విద్యార్థి జాడ తెలియరాకపోవడంతో సందీప్ స్వగ్రామం గౌడవెల్లిలో విషాదం అలుముకుంది. అతడి కోసం తల్లిదండ్రులు వీరేష్, విజయలతో పాటు కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సందీప్ జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. తన ఇంటికి కనీసం అధికారులు వచ్చి వివరాలు కూడా తెలుసుకోవడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్, సందీప్ తండ్రి వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
డోన్‌లో తెలుగు తమ్ముళ్ల హల్చల్
డోన్ టౌన్ : అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. డోన్ పట్టణంలో తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గురువారం సాయంత్రం రద్దీగా ఉన్న చిగురుమానుపేటలోని అమ్మ హోటల్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కొందరు రౌడీమూకలు తప్పతాగిన మైకంలో కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో నడిరోడ్డులో ఈ దృశ్యాలను చూస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాడి వెనుక టీడీపీ చెందిన నాయకుల కుట్ర ఉందని బాధితులతో పాటు దాడిని ప్రత్యక్షంగా చూసిన పలువురు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి రోడ్డులో బండల వ్యాపారం చేసే ఉప్పరి ఈశ్వరయ్య ఇటీవల జరిగిన మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. పార్టీ కార్యకర్తగా ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీలో మంచి గుర్తింపు రావడం, పలువురితో పరిచయాలు ఉండటం, ఆర్థికంగా పలువురిని ఆదుకోవడం లాంటి పనులు ఈశ్వరయ్య చేస్తుండేవాడు. జీర్ణించుకోలేని ఆ ప్రాంత టీడీపీ చోటా నాయకులు ఫైనాన్స్ విషయాలను సాకుగా చూపి రౌడీలను దాడికి ఉసిగొల్పారని బాధితుడి బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో బోయ ఈశ్వరయ్య, బోయ నాగరాజు, గిడ్డయ్య, పుల్లగుమ్మి మద్దిలేటి, రాజంపేట మల్లికార్జున తదితరులు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఈశ్వరయ్య...: రౌడీ మూకల దాడిలో గాయపడ్డ ఉప్పరి ఈశ్వరయ్య కడుపులో కత్తిపోటు పడటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రథమ చికిత్స అందించిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రెఫర్ చేశారు. పెట్రేగిపోతున్న అధికార పార్టీ దాడులు...: మూడు రోజుల క్రితం రాచర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీలో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న అంకన్నపై అధికార పార్టీకి చెందిన వీరేష్, సురేష్‌గౌడ్ దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంలో తాత్సరం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతలోనే డోన్ పట్టణంలో మరో సంఘటన చోటు చేసుకోవడంతో నిందితులపై పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఉలిక్కిపడిన గౌడవెల్లి
సందీప్ గల్లంతుతో విషాదం శోకసంద్రంలో కుటుంబీకులు విషాదంలో సందీప్ కుటుంబసభ్యులు మేడ్చల్/మేడ్చల్ రూరల్: విజ్ఞాన విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదం బారిన పడడంతో మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామం ఉలిక్కిపడింది. గ్రామం నుంచి వెళ్లిన విద్యార్థి బస్వరాజ్ సందీప్ ఆచూకీ గల్లంతవడంతో విషాదం నెలకొంది. ఘటన గురించి విద్యార్థి కుటుంబీకులు ఆదివారం రాత్రి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. తన కొడుకు సమాచారం కోసం విద్యార్థి తండ్రి బస్వరాజ్ వీరేష్, స్థానికులతో కలిసి సందీప్ చదువుతున్న బాచుపల్లి శివారులోని కళాశాల వద్దకు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. అర్ధరాత్రి వరకు ఉన్న వారు.. చేసేది లేక ఇంటిముఖం పట్టారు. సందీప్ గల్లంతైన విషయం టీవీ చానళ్ల ద్వారా తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు వీరేష్, విజయలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ విషయం గ్రామంలో ఆదివారం రాత్రి దావానలంలా పాకడంతో స్థానికులు సందీప్ ఇంటికి చేరుకొని టీవీలు చూస్తూ ఉండిపోయారు. నిరుపేద కుటుంబం.. గౌడవెల్లి గ్రామానికి చెందిన సందీప్ తండ్రి బస్వరాజ్ వీరేష్ మేడ్చల్ న్యాయస్థానంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్నాడు. వీరేష్, విజయ దంపతులకు సందీప్ మొదటి సంతానం కాగా మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎలాంటి ఆస్తులు లేని వీరేష్ ఉద్యోగం చేసుకుంటూ ముగ్గురి పిల్లలను చదివిస్తున్నాడు. సందీప్ గల్లంతుతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం సాయంత్రం వరకు సందీప్ గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామస్తులు వీరేష్ ఇంటికి చేరుకుని వీరేష్ కుటుంబీకులకు మనోధైర్యం చెప్పారు. ఆదివారం సాయంత్రం తండ్రితో మాట్లాడిన సందీప్ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సందీప్ ఫోన్లో తనతో మాట్లాడాడని వీరేష్ రోదిస్తూ చెప్పాడు. తామంతా హిమాచల్ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో ఉన్నామని, క్షేమంగా ఉన్నామని చెప్పిన విద్యార్థి కుటుంబ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు. సోమవారం ఉదయం బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకొని తాము సందీప్ సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా పనిచేయడం లేదనే సమాధానం వస్తుందని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం వరకు కూడా సందీప్ గురించి సమాచారం తెలియరాలేదు. కాగా వీరేష్‌ది నిరుపేద కుటుంబం అవడంతో హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.