ఉలిక్కిపడిన గౌడవెల్లి | Sandeep's family in tragedy | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన గౌడవెల్లి

Published Mon, Jun 9 2014 11:37 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

ఉలిక్కిపడిన గౌడవెల్లి - Sakshi

ఉలిక్కిపడిన గౌడవెల్లి

సందీప్ గల్లంతుతో విషాదం శోకసంద్రంలో కుటుంబీకులు
 
విషాదంలో సందీప్ కుటుంబసభ్యులు
 
మేడ్చల్/మేడ్చల్ రూరల్: విజ్ఞాన విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదం బారిన పడడంతో మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామం ఉలిక్కిపడింది. గ్రామం నుంచి వెళ్లిన విద్యార్థి బస్వరాజ్ సందీప్ ఆచూకీ గల్లంతవడంతో విషాదం నెలకొంది. ఘటన గురించి విద్యార్థి కుటుంబీకులు ఆదివారం రాత్రి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. తన కొడుకు సమాచారం కోసం విద్యార్థి తండ్రి బస్వరాజ్ వీరేష్, స్థానికులతో కలిసి సందీప్ చదువుతున్న బాచుపల్లి శివారులోని కళాశాల వద్దకు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది.
 
అర్ధరాత్రి వరకు ఉన్న వారు.. చేసేది లేక ఇంటిముఖం పట్టారు. సందీప్ గల్లంతైన విషయం టీవీ చానళ్ల ద్వారా తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు వీరేష్, విజయలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ విషయం గ్రామంలో ఆదివారం రాత్రి దావానలంలా పాకడంతో స్థానికులు సందీప్ ఇంటికి చేరుకొని టీవీలు చూస్తూ ఉండిపోయారు.
 
 నిరుపేద కుటుంబం..
గౌడవెల్లి గ్రామానికి చెందిన సందీప్ తండ్రి బస్వరాజ్ వీరేష్ మేడ్చల్ న్యాయస్థానంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్నాడు. వీరేష్, విజయ దంపతులకు సందీప్ మొదటి సంతానం కాగా మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎలాంటి ఆస్తులు లేని వీరేష్ ఉద్యోగం చేసుకుంటూ ముగ్గురి పిల్లలను చదివిస్తున్నాడు. సందీప్ గల్లంతుతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం సాయంత్రం వరకు సందీప్ గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామస్తులు వీరేష్ ఇంటికి చేరుకుని వీరేష్ కుటుంబీకులకు మనోధైర్యం చెప్పారు.
 
ఆదివారం సాయంత్రం తండ్రితో మాట్లాడిన సందీప్
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సందీప్ ఫోన్‌లో తనతో మాట్లాడాడని వీరేష్ రోదిస్తూ చెప్పాడు. తామంతా హిమాచల్ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో ఉన్నామని, క్షేమంగా ఉన్నామని చెప్పిన విద్యార్థి కుటుంబ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు.
 
సోమవారం ఉదయం బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకొని తాము సందీప్ సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా పనిచేయడం లేదనే సమాధానం వస్తుందని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం వరకు కూడా సందీప్ గురించి సమాచారం తెలియరాలేదు. కాగా వీరేష్‌ది నిరుపేద కుటుంబం అవడంతో హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement