
లిఫ్టు అడుగున మహిళ మృతదేహం
తిరువొత్తియూరు: చెన్నై కొత్వాల్ చావడిలోని ఓ అపార్టుమెంటు లిప్టు అడుగుభాగంలో మహిళ మృతదేహాన్ని సోమవారం పోలీసులు కనుగొన్నారు. చెన్నై కొత్వాల్ చావడి సాధిక్ వీధికి చెందిన సాధిక్ వీధికి చెందిన వ్యక్తి డేవిడ్ సింగ్ (45). ఇతను షావుకారుపేటలో బొమ్మల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య రేణుక (40). శనివారం ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళిన రేణుక తిరిగి ఇంటికి రాలేదు. ఈమె బంధువులు ఈమె కోసం అన్ని చోట్ల గాలించినప్పటికీ రేణుక ఆచూకి తెలియలేదు.
దీనిపై కొత్వాల్ చావడి పోలీసులకు డేవిడ్‌సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రేణుక నివాసం వుంటున్న అపార్టుమెంటులో వున్న లిప్టు అడుగు నుంచి దుర్వాసన వెలువడింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేయగా రెండు రోజులుగా లిప్టు పని చేయడం లేదని తెలిసింది.
దీంతో కార్మికులను పిలిపించి లిప్టు తొలగించి చూడగా లిప్టు కింద శరీరం నలిగిన స్థితిలో రేణుక శవంగా పడి ఉంది. ఇది చూసిన అక్కడి వారు దిగ్భ్రాంతి చెందారు. రేణుక లిఫ్టుకు అడుగు భాగంలోకి ఎందుకు వెళ్లింది, ఎలా మృతి చెందిందని పోలీసులు విచారణ చేస్తున్నారు.