ప్రాణం తీసిన పిల్లి తగాదా..
ముంబై: పెంపుడు పిల్లివల్ల ఇరుగుపొరుగు వారి మధ్య జరిగిన వివాదం మహిళ ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటనకు కారణమైన నలుగురిని స్థానిక హింజ్‌వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు పింప్రి ప్రాంతంలో నివాసముంటున్న ప్రభా రంగ్‌పిసే ఇంట్లో పెంపుడు పిల్లి ఉంది. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పక్క ఇంట్లో ఉంటున్న నందకిషోర్ సాల్వే ఇంటికి పిల్లి వెళ్లింది.
ఆ సమయంలో వారు భోజనం చేస్తున్నారు. ఆ పిల్లి భోజనం ప్లేట్‌లో మూతి పెట్టడంతో ఆగ్రహానికి గురైన నందకిషోర్ దాన్ని బయటకు విసిరి పాడేశాడు. ఈ విషయాన్ని నిలదీసేందుకు వెళ్లిన ప్రభాపై సాల్వి కుటుంబ సభ్యులు కర్రలు, ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభా తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్ది సేపటికే ఆమె మృతి చెందడంతో పోలీసులు అమోల్, గణేశ్, ఆకాశ్, రాజీవ్ లను అదుపులోకి తీసుకున్నారు.