సాక్షి, ముంబై: విధి నిర్వహణలో బ్యాంకు ఆస్తులను కాపాడబోయి ఓ మహిళా అధికారి ప్రాణాలు కోల్పోయిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫాల్గర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒకప్పటి బ్యాంకు మేనేజర్ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన మహిళా ఉద్యోగులపై కత్తులతో ఎటాక్ చేసి ఒక అధికారిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ యోగితా వార్తక్ ప్రాణాలు కోల్పోగా, మరో ఉద్యోగిని, బ్యాంకు క్యాషియర్ శ్రద్ధా దేవ్రుఖ్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో విరార్ ఈస్ట్ బ్రాంచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
అసిస్టెంట్ మేనేజర్ యోగితా వార్తక్, క్యాషియర్ శ్రద్ధా దేవ్రుఖ్కర్ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి కత్తులతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. నగలు నగదు ఇవ్వమంటూ మహిళా ఉద్యోగినుల ఇద్దరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే వారిని ధైర‍్యంగా ఎదుర్కొన్న యోగితా అలారం మోగించి సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో డబ్బులు, జ్యువెల్లరీ తీసుకొని పారిపోతూ ఇద్దరు మహిళలపైనా కత్తితో దాడిచేశారు. ప్రధానంగా వర్తక్‌పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. అయితే అలారంతో అప్రమత్త మైన సిబ్బంది బ్యాంక్ లోపల రక్తపు మడుగులో పడి ఉన్న యోగితాను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. యెగితాను కాపాడబోయి తీవ్ర గాయాల పాలైన దేవ్రుఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పారిపోతున్న అనిల్ దుబేను పట్టుకోగా, మరో నిందితుడు మాత్రం అక్కడి నుంచి ఉడాయించాడు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ బ్యాంకు మాజీ మేనేజరే అనిల్ దుబే, మరో వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గతంలో ఇదే బ్యాంకులో కోటి రూపాయల రుణం తీసుకున్నాడు అనిల్. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టాడు. చివరికి ఏకంగా బ్యాంకుకే కన్నం వేసేందుకు కుట్ర పన్నాడు. ప్రస్తుతం అతను మరో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని సీనియర్ పోలీసు అధికారి సురేష్ వరదే వెల్లడించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment