ప్రేమించలేదని బీరు బాటిల్‌తో దాడి
Published Fri, May 5 2017 12:25 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
వల్లేటివారిపాలెం: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై బీరు బాటిల్‌తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని వల్లేటివారిపాలెం మండలం కొండ సముద్రం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన యలమలమంద కవిత(18) కుటుంబ సభ్యులు గత కొంత కాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఆరు నెలల నుంచి కవిత స్వగ్రామంలోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఘట్టమనేని రవి(22) కొంత కాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ విషయమై కొన్ని రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ కూడా జరిగింది.
ఈ క్రమంలో కవిత ఊళ్లోనే ఉంటోందని తెలుసుకున్న రవి తిరిగి ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన కవితను ప్రేమించమని వేధింపులకు గురిచేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. వెంట తెచ్చుకున్న బీరు బాటిల్ పగలగొట్టి ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వీపు, చేతులు, మెడ భాగాల్లో గాయాలయ్యాయి. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement