వెంటాడిన ప్రాణం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఫ్పై రోజులు కష్టపడి సంపాదించుకున్న జీతాన్ని మూడు నిమిషాల్లో దొంగలు తన్నుకుపోతుంటే తట్టుకోలేని ఓ యువతి వారి వెంటపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన చెన్నైలో సోమవారం రాత్రి జరిగింది. ఇదే సంఘటనలో మరో వృద్ధుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో యువతి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతోంది. క్రైంసినిమాలా సాగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై పట్టినపాక్కం శ్రీనివాసపురానికి చెందిన వడివేలు కుమార్తె నందిని (24) నీలాంగరైలోని ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటలకు జీతం సొమ్మును డ్రా చేసేందుకు హోండా యాక్టివా టూ వీలర్‌లో మైలాపూర్ రామకృష్ణ మఠ్ సమీపంలోని ఏటీఎంకు వెళ్లారు.
డాక్టర్ ఎంజీఆర్ నగర్ జానకీ మహిళా కళాశాలలో చదువుతున్న నందినీ అత్త కూతురు న జ్జూను తోడుగా తీసుకుని ఏటీఎంకు చేరుకున్నారు. ఏటీఎం నుంచి రూ.25 వేలు డ్రా చేసి హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఇంటికి బయలుదేరారు. డబ్బున్న హాండ్ బ్యాగ్‌ను నజ్జూ పట్టుకోగా బైక్‌ను నందిని నడుపుతోంది. కొద్ది దూరం వీరు ప్రయాణించగానే ఒక బైక్‌లో వాయువేగంలో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు నజ్జూ చేతిలోని హాండ్‌బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించారు. జీతం సొమ్మును దోచుకుపోవడంతో కంగారుపడిన నందిని తన టూవీలర్‌పై దొంగల బైక్‌ను వెంబడించింది.
పట్టినబాక్కం బీచ్, కరుమారి అమ్మన్ కోవిల్ ఆలయం మీదుగా రెండు బైక్‌లు 80 కిలోమీటర్ల వేగంతో ఒకదాని వెనుక ఒకటి వేగంగా పరుగులుపెట్టాయి. దొంగ తన బైక్‌కు సడన్ బ్రేక్ వేసి అకస్మాత్తుగా వెనక్కుతిప్పి శ్రీనివాసపురం వైపు పరుగులు పెట్టించాడు. విపరీతమైన వేగంతో వస్తున్న నందిని తన బైక్‌ను అదుపుచేయలేక పోవడంతో వెనుక కూర్చుని ఉన్న నజ్జూ కిందపడి పోయి తీవ్రగాయాలకు గురైంది. ఆ తరువాత కూడా ముందుకు పరుగులు తీస్తున్న బైక్‌పై నుంచి కిందపడిన నందిని తలకు సిమెంట్ దిమ్మె తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనపై పట్టినపాక్కం పోలీసులు సమాచారం ఇవ్వడంతో పాటూ దొంగ శ్రీనివాసపురం వైపు వెళ్లాడని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
దీంతో తప్పించుకునేందుకు వీలులేని దొంగ తాను వచ్చిన మార్గంలోని మళ్లీ తిరుగు ప్రయాణమై ప్రజల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శేఖర్ అనే వృద్ధుడిని ఢీకొట్టి కిందపడిపోయాడు. వెంటనే ప్రజలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బైక్ ఢీకొన్న వేగానికి తీవ్రంగా గాయపడిన శేఖర్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న నజ్జూను ఆసుపత్రిలో చేర్పించారు. పెరియమేడుకు చెందిన దొంగల్లో కరుణాకరన్ పట్టుబడగా మరో దొంగ తప్పించుకున్నాడు. నందినికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా మృత్యు ఒడిలోకి చేరి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం: ప్రజలు చూస్తుండగానే దొంగలు స్వైర విహారం చేయడం, ఇద్దరి ప్రాణాలను హరించడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు రెండు వందలకు పైగా జనం గుంపులుగా చేరి పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. దొంగ వినియోగించిన బైక్‌ను తగులబెట్టారు. పట్టుబడిన దొంగను తీసుకుని పోతున్న పోలీసులను ప్రజలు అనుసరించారు. పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకు రావడంతో ఆగ్రహించిన పోలీసులు ‘వెళ్లిపోండి లేకుంటే తుపాకీతో కాల్చి వేస్తాను’ అని బెదిరించడంతో ప్రజలు మరింతగా రెచ్చిపోయారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అనేక విడత చర్చ తరువాత అందోళనను విరమింపజేశారు.