= నిన్న శాఖ కోసం... నేడు గది కోసం
= అప్పుడే డీకే ఆధిపత్య పోరు
= 346 గది కోసం పట్టు .. సహించని ఆంజనేయ
= కార్యక్రమంలోనే అధికారిపై మండిపాటు
= అవాక్కయిన ఆహూతులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రులిద్దరు నిన్న శాఖల కోసం కొట్లాడుకోగా.. విధాన సౌధలో ఓ గది కోసం నేడు ఇద్దరు మంత్రుల మధ్య శీతల యుద్ధం ప్రారంభమైంది. వీరిలో ఓ మంత్రి తన ఆగ్రహాన్ని అధికారుల ముందే ప్రదర్శించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయకు విధాన సౌధలోని 340, 340ఏ గదులను కేటాయించారు. విశాలంగా ఉండడం కోసం రెండు గదుల మధ్య ఉన్న గోడను పడగొట్టాలని మంత్రి సూచించారు. ఆ పనుల నిమిత్తం తాత్కాలికంగా 346 గదిలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
కొత్త గా మంత్రి వర్గంలో చేరిన డీకే. శివ కుమార్ 340 గది కోసం పట్టుబట్టారు. ఆయన పట్టుదల కాంగ్రెస్ నాయకులకు తెలియందేమీ కాదు. 1999-2004లో ఎస్‌ఎం. కృష్ణ హయాంలో ఆయన ఆడింది ఆట.. పాడింది పాట. ఇతర శాఖల్లో కూడా ఆయన వేలు పెడుతున్నారని అప్పట్లో సీనియర్లు గుర్రుమన్నా, నిస్సహాయంగా ఉండిపోయారు. కృష్ణ వద్ద ఆయనకున్న పలుకుబడి అలాంటిది. ఇప్పుడు మంత్రి వర్గంలో చేరారో, లేదో...అప్పుడే తన విశ్వ రూపాన్ని చూపడం ప్రారంభించారు.
తనకు కేటాయించిన గదిని శివ కుమార్ కోరుతున్నారని తెలుసుకున్న ఆంజనేయ సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులపై మండి పడ్డారు. మంత్రులకు గదులు కేటాయించేది వారే. విధాన సౌధలో శుక్రవారం తన గదిలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంజనేయ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప కూడా హాజరయ్యారు.
పెద్ద సంఖ్యలో ఆహూతులు కూడా వచ్చారు. అంతా సవ్యంగా జరుగుతున్న దశలో ఓ అధికారిని చూసి ఆంజనేయ కస్సుమనడం ప్రారంభించారు. ‘ఆ గది తాళం తీయండి, గోడ పగులగొట్టండి. ఎవడొస్తాడో చూస్తాను. ఎన్ని రోజులని బాధను భరించేది. ఆఫీసుకు ప్రజలు వస్తే కూర్చోవడానికి జాగా లేదు. తాళం తీయండి. పదండి నేనే వస్తాను’ అని మంత్రి ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడాన్ని చూసి ఆహూతులు నోళ్లప్పగించి చూస్తుండి పోయారు.
మళ్లీ కీచులాట
Published Sat, Jan 4 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement