రాష్ట్రంలో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్‌ను సరఫరా చేయడం కష్టమవుతోందని విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్‌ను సరఫరా చేయడం కష్టమవుతోందని విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు. శాసన సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కొరతను నివారించడానికి రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం లభ్యమవుతున్న విద్యుత్‌తో రాష్ర్టంలోని వినియోగదారులందరికీ సరఫరా చేయడం కష్టమవుతోందని తెలిపారు. అయితే ప్రకటిత వేళల్లో సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ సభ్యుడు బసవరాజ రాయరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విద్యుత్ కొరతను నివారించడానికి రెండు వేల మెగావాట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
రాష్ర్టంలో రోజూ సగటున 8,500 మెగావాట్లకు డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం అన్ని వనరుల నుంచి 7,500 మెగావాట్లు మాత్రమే లభ్యమవుతోందన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీలో గత ప్రభుత్వ హయాంలో 35 శాతం మేరకు నష్టం వాటిల్లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని బాగా తగ్గించగలిగామని వెల్లడించారు.