DK. Siva Kumar
-
రెండు వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో డిమాండ్‌కు తగినట్లు విద్యుత్‌ను సరఫరా చేయడం కష్టమవుతోందని విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు. శాసన సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కొరతను నివారించడానికి రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం లభ్యమవుతున్న విద్యుత్‌తో రాష్ర్టంలోని వినియోగదారులందరికీ సరఫరా చేయడం కష్టమవుతోందని తెలిపారు. అయితే ప్రకటిత వేళల్లో సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ సభ్యుడు బసవరాజ రాయరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విద్యుత్ కొరతను నివారించడానికి రెండు వేల మెగావాట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. రాష్ర్టంలో రోజూ సగటున 8,500 మెగావాట్లకు డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం అన్ని వనరుల నుంచి 7,500 మెగావాట్లు మాత్రమే లభ్యమవుతోందన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీలో గత ప్రభుత్వ హయాంలో 35 శాతం మేరకు నష్టం వాటిల్లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని బాగా తగ్గించగలిగామని వెల్లడించారు. -
మళ్లీ కీచులాట
= నిన్న శాఖ కోసం... నేడు గది కోసం = అప్పుడే డీకే ఆధిపత్య పోరు = 346 గది కోసం పట్టు .. సహించని ఆంజనేయ = కార్యక్రమంలోనే అధికారిపై మండిపాటు = అవాక్కయిన ఆహూతులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రులిద్దరు నిన్న శాఖల కోసం కొట్లాడుకోగా.. విధాన సౌధలో ఓ గది కోసం నేడు ఇద్దరు మంత్రుల మధ్య శీతల యుద్ధం ప్రారంభమైంది. వీరిలో ఓ మంత్రి తన ఆగ్రహాన్ని అధికారుల ముందే ప్రదర్శించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయకు విధాన సౌధలోని 340, 340ఏ గదులను కేటాయించారు. విశాలంగా ఉండడం కోసం రెండు గదుల మధ్య ఉన్న గోడను పడగొట్టాలని మంత్రి సూచించారు. ఆ పనుల నిమిత్తం తాత్కాలికంగా 346 గదిలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త గా మంత్రి వర్గంలో చేరిన డీకే. శివ కుమార్ 340 గది కోసం పట్టుబట్టారు. ఆయన పట్టుదల కాంగ్రెస్ నాయకులకు తెలియందేమీ కాదు. 1999-2004లో ఎస్ఎం. కృష్ణ హయాంలో ఆయన ఆడింది ఆట.. పాడింది పాట. ఇతర శాఖల్లో కూడా ఆయన వేలు పెడుతున్నారని అప్పట్లో సీనియర్లు గుర్రుమన్నా, నిస్సహాయంగా ఉండిపోయారు. కృష్ణ వద్ద ఆయనకున్న పలుకుబడి అలాంటిది. ఇప్పుడు మంత్రి వర్గంలో చేరారో, లేదో...అప్పుడే తన విశ్వ రూపాన్ని చూపడం ప్రారంభించారు. తనకు కేటాయించిన గదిని శివ కుమార్ కోరుతున్నారని తెలుసుకున్న ఆంజనేయ సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులపై మండి పడ్డారు. మంత్రులకు గదులు కేటాయించేది వారే. విధాన సౌధలో శుక్రవారం తన గదిలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంజనేయ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఆహూతులు కూడా వచ్చారు. అంతా సవ్యంగా జరుగుతున్న దశలో ఓ అధికారిని చూసి ఆంజనేయ కస్సుమనడం ప్రారంభించారు. ‘ఆ గది తాళం తీయండి, గోడ పగులగొట్టండి. ఎవడొస్తాడో చూస్తాను. ఎన్ని రోజులని బాధను భరించేది. ఆఫీసుకు ప్రజలు వస్తే కూర్చోవడానికి జాగా లేదు. తాళం తీయండి. పదండి నేనే వస్తాను’ అని మంత్రి ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడాన్ని చూసి ఆహూతులు నోళ్లప్పగించి చూస్తుండి పోయారు. -
అసంతృప్తి విస్తరణ
చెప్పేది శ్రీరంగనీతులు .... = కళంకితులకు అందలమా! = మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ శ్రేణుల్లో విస్మయం = అధిష్టానం నిర్ణయానికి తలొగ్గిన సీఎం = నిరాడంబరంగా ప్రమాణ స్వీకారోత్సవం = ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి = లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం = బీజేపీ చేతికి మరో ‘మైనింగ్’ అస్త్రం సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్ర మంత్రి వర్గంలో డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లకు స్థానం కల్పించడంపై బయట మాటెలా ఉన్నా, కాంగ్రెస్‌లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి పదవులపై కన్నేసిన అనేక మందికి ఈ ‘స్వల్ప విస్తరణ’ కడుపు మంటను రగిల్చింది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ‘ఈ రోజు కాకపోతే రేపు’ మంత్రి పదవులు లభించకపోతాయా అని ఆశలు పెంచుకుంటూ వచ్చారు. హఠాత్తుగా ఇద్దరికి మాత్రమే స్థానం కల్పించడంపై వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. శివ కుమార్ తండ్రి మంగళవారం కాల ధర్మం చెందారు. మరుసటి రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వీరిద్దరిని మంత్రి వర్గంలో చేర్చుకోవడం ఇష్టం లేదు. అధిష్టానం నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఆయన చేయలేక పోయారు. బీజేపీ హయాంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేశారు. అలాంటి సిద్ధరామయ్య అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తన మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు వస్తాయనే బుధవారం సాయంత్రం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆయన అత్యంత నిరాడంబరంగా జరపాలని అధికారులకు సూచించారు. సాధారణంగా రాజ్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో తిలకించడానికి అక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు రాజ్ భవన్‌లోని బాంక్వెట్ హాలులో ఈ ఇద్దరి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేశారు. మీడియా నుంచి కేవలం 23 మందిని మాత్రమే అనుమతించారు. ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా మెన్‌ను సైతం అనుమతించ లేదు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విస్తరణ బీజేపీకి ఓ అస్త్రాన్ని అందించినట్లయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఈ ఆయుధాన్ని విృ్తతంగా వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన మే నెల వరకు ఆగి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ వీర విధేయులు సైతం ఈ విస్తరణను వ్యతిరేకించారు. కాగా శివ కుమార్, రోషన్ బేగ్‌లకు గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. శివ కుమార్ రామనగర జిల్లా కనకపుర స్థానానికి, రోషన్ బేగ్ నగరంలోని శివాజీ నగర స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరి ఒత్తిడీ లేదు మంత్రి వర్గ విస్తరణకు తనపై ఎవరూ ఒత్తిడి తీసుకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన సొంత నిర్ణయం మేరకు వీరిద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకున్నానని చెప్పారు. శివ కుమార్‌పై ఓ ఆరోపణ ఉందని, దాని విచారణపై ఆయన స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రోషన్ బేగ్‌పై ప్రైవేట్ ఫిర్యాదు ఉందని చెబుతూ, సంతోషంగానే విస్తరణ చేపట్టానని వెల్లడించారు.