చెప్పేది శ్రీరంగనీతులు ....
= కళంకితులకు అందలమా!
= మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ శ్రేణుల్లో విస్మయం
= అధిష్టానం నిర్ణయానికి తలొగ్గిన సీఎం
= నిరాడంబరంగా ప్రమాణ స్వీకారోత్సవం
= ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి
= లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం
= బీజేపీ చేతికి మరో ‘మైనింగ్’ అస్త్రం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్ర మంత్రి వర్గంలో డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లకు స్థానం కల్పించడంపై బయట మాటెలా ఉన్నా, కాంగ్రెస్‌లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి పదవులపై కన్నేసిన అనేక మందికి ఈ ‘స్వల్ప విస్తరణ’ కడుపు మంటను రగిల్చింది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ‘ఈ రోజు కాకపోతే రేపు’ మంత్రి పదవులు లభించకపోతాయా అని ఆశలు పెంచుకుంటూ వచ్చారు. హఠాత్తుగా ఇద్దరికి మాత్రమే స్థానం కల్పించడంపై వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. శివ కుమార్ తండ్రి మంగళవారం కాల ధర్మం చెందారు.
మరుసటి రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వీరిద్దరిని మంత్రి వర్గంలో చేర్చుకోవడం ఇష్టం లేదు. అధిష్టానం నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఆయన చేయలేక పోయారు. బీజేపీ హయాంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేశారు. అలాంటి సిద్ధరామయ్య అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తన మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి విమర్శలు వస్తాయనే బుధవారం సాయంత్రం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆయన అత్యంత నిరాడంబరంగా జరపాలని అధికారులకు సూచించారు. సాధారణంగా రాజ్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో తిలకించడానికి అక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు రాజ్ భవన్‌లోని బాంక్వెట్ హాలులో ఈ ఇద్దరి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేశారు.
మీడియా నుంచి కేవలం 23 మందిని మాత్రమే అనుమతించారు. ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా మెన్‌ను సైతం అనుమతించ లేదు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విస్తరణ బీజేపీకి ఓ అస్త్రాన్ని అందించినట్లయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఈ ఆయుధాన్ని విృ్తతంగా వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన మే నెల వరకు ఆగి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ వీర విధేయులు సైతం ఈ విస్తరణను వ్యతిరేకించారు. కాగా శివ కుమార్, రోషన్ బేగ్‌లకు గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. శివ కుమార్ రామనగర జిల్లా కనకపుర స్థానానికి, రోషన్ బేగ్ నగరంలోని శివాజీ నగర స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎవరి ఒత్తిడీ లేదు
మంత్రి వర్గ విస్తరణకు తనపై ఎవరూ ఒత్తిడి తీసుకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన సొంత నిర్ణయం మేరకు వీరిద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకున్నానని చెప్పారు. శివ కుమార్‌పై ఓ ఆరోపణ ఉందని, దాని విచారణపై ఆయన స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రోషన్ బేగ్‌పై ప్రైవేట్ ఫిర్యాదు ఉందని చెబుతూ, సంతోషంగానే విస్తరణ చేపట్టానని వెల్లడించారు.
అసంతృప్తి విస్తరణ
Published Thu, Jan 2 2014 5:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement