ఎవడు తమిళ గీతాల ఆవిష్కరణ
ఎవడు చిత్రం తమిళ వెర్షన్ గీతాలావిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది. తెలుగులో రామ్ చరణ్ తేజ, అల్లుఅర్జున్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎవడు. కాజల్ అగర్వాల్,ఎమిజాక్సన్, శ్రుతిహాసన్ ముగ్గురు బిగ్ బ్యూటీస్ నటించిన కలర్‌ఫుల్ భారీ యాక్షన్ చిత్రం ఇది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ విభిన్న కథా చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఇంతకు ముందు వంబు, భద్ర, గాయత్రి ఐపీఎస్,భాష వంటి విజయవంతమైన చిత్రాలను అందించి రీసెంట్‌గా శ్రీమంతుడు చిత్రాన్ని సెల్వందన్ పేరుతో విడుదల చేసి హిట్‌ను అందుకున్న భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ ఏవీవీఎస్.నాయుడు సమర్పణలో మగధీర పేరుతో అందించనున్నారు. అడ్డాల వెంకట్రావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఏఆర్‌కే రాజా మాటలు రాసిన ఈ చిత్ర ఆడియోను సీ.కల్యాణ్, జాక్వుర్ తంగం ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు.