- సీఎంకు అధిష్టానం హితవు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పార్టీని ఏకతాటిపై నడిపించడమే కాకుండా, నాయకులందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం హితవు పలికింది. ఉత్తమ పాలన అందించాలని, అదే సమయంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండాలని సూచించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై బుధవారం సాయంత్రం వరకు ఢిల్లీలో జరిగిన విశ్లేషణ సమావేశం సందర్భంగా సీఎంకు ఈ సూచనలు అందాయి. పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ నాయకత్వంలోని కమిటీని అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో మరిన్ని సీట్లను గెలుచుకునే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నారని సమావేశంలో ముఖ్యమంత్రి వద్ద ఆంటోనీ నిష్టూరమాడినట్లు సమాచారం. బీజేపీని సమైక్యంగా ఎదుర్కోక పోవడం వల్లే తొమ్మిది సీట్లకు పరిమితం కావాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలిసింది. మరో వైపు ఎన్నికల్లో ఓటమి పాలైన నటి రమ్య (మండ్య), మంజునాథ్ భండారీ (శివమొగ్గ), రిజ్వాన్ అర్షద్ (బెంగళూరు సెంట్రల్)లు ఆంటోనీని కలుసుకుని నాయకుల మధ్య విభేదాలే పార్టీ ఓటమికి కారణమని ఫిర్యాదు చేశారు.
పార్టీకి చెరుపు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి ముఖ్యమంత్రి వైఖరే కారణమని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో కలసి ఆయన ఆంటోనీని కలుసుకున్నప్పుడు యూపీఏపై వ్యతిరేకత వల్లే ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వివరణ ఇచ్చారు. ఆంటోనీని విడిగా కలుసుకున్నప్పుడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరును సూచిస్తున్నాయని విమర్శించినట్లు తెలిసింది.