- సీఎల్‌పీ సమావేశంలో ఎమ్మెల్యేల డిమాండ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఏపీఎల్ కార్డుదారులకూ సబ్సిడీ బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం విధాన సౌధలోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సీఎల్‌పీ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఏపీఎల్ కార్డులకు బియ్యంతో పాటు కిరోసిన్ ఇవ్వాలన్నారు.
గతంలో ఏపీఎల్ కార్డులపై పరిమితంగా ఇస్తున్న బియ్యాన్ని కూడా ప్రస్తుతం ఇవ్వడం లేదని, దీని వల్ల మధ్య తరగతి కుటుంబాల్లో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి నెలకొందని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల్లో కూడా పేదలున్నారని, వారికి కూడా సబ్సిడీ బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వివరించారు. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. పట్టణాల్లో మాదిరే గ్రామాల్లో కూడా ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించారు. శాసన సభ సమావేశాలు ముగిసే లోగా ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం వారికి హామీ ఇచ్చారు.
మంత్రులు అందుబాటులో ఉండాలి
విధాన సౌధలో వారంలో రెండు రోజుల పాటు మంత్రులు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎల్‌పీ సమావేశంలో ఎప్పటిలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై ఆరోపణలు గుప్పించారు. మంత్రులను కలుసుకోవడం సాధ్యం కావడం లేదని ఆరోపించారు. దీంతో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని విధాన సౌధతో పాటు వికాస సౌధలోని తమ కార్యాలయాల్లో మంత్రులు ప్రతి బుధ, గురువారాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలపై అక్కడికక్కడే అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.
విపక్షాలను సమైక్యంగా ఎదుర్కోవాలి
శాసన సభ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాల విమర్శలను కలసికట్టుగా తిప్పి కొట్టాలని సీఎం ఉపదేశించారు. ప్రభుత్వ ఏడాది సాధనలను వివరిస్తూ ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పాలని సూచించారు. ఈ సమావేశాలు సుదీర్ఘ కాలం పాటు జరుగనున్నందున, మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహనతో సభకు రావాలని తెలి పారు.
విపక్షాలు మంత్రులపై విమర్శలు ఎక్కుపెట్టినప్పుడు, ఎమ్మెల్యేలు వారికి సాయంగా ఉండాలని ఉద్బోధించారు. చర్చ సందర్భంగా మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు చేయకూడదని, వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని సూచించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సకాలంలో సభకు హాజరు కావాలని, లాబీలలో కూర్చుని కబుర్లు చెబుతూ కాలం గడపరాదని ఆయన ఉద్బోధించారు.