గోకుల్‌రాజ్ హత్య కేసులో బెయిల్‌పై విడుదలై తిరునెల్వేలిలో బస చేసి పోలీసు స్టేషన్‌లో ఉదయం, సాయంత్రం సంతకం చేసి...
ఇద్దరి అరెస్ట్
కేకే.నగర్: గోకుల్‌రాజ్ హత్య కేసులో బెయిల్‌పై విడుదలై తిరునెల్వేలిలో బస చేసి పోలీసు స్టేషన్‌లో ఉదయం, సాయంత్రం సంతకం చేసి వస్తున్న యువరాజ్‌ను హత్య చేయడానికి కుట్రపన్నిన వీసీకే జిల్లా కార్యదర్శి సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ హత్య కేసులో ముఖ్య నిందితుడైన యువరాజ్ సీబీసీఐడీ పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యువరాజ్‌పై హత్యా ప్రయత్నం చేస్తున్నట్లు క్రైంబ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో యువరాజ్‌కు అదనపు భద్రత ఏర్పాటు చేశారు. హోటల్‌లో బసచేసి ఉన్న యువరాజ్‌ను టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా గల ఇంటికి మార్చారు. అక్కడ అధిక సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి ఉంచారు. ఈ నేపథ్యంలో యువరాజ్ పోలీసుస్టేషన్‌కు సంతకం చేయడానికి వచ్చి వెళ్లే సమయంలో అతనిపై బాంబు విసిరి హత్యచేయడానికి కొందరు పథకం పన్నినట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై జరిపిన విచారణలో తిరునెల్వేలి వీసీకే కోశాధికారి సి.శేఖర్, కీల్పాక్కంకు చెందిన ముత్తురాజ్ అని తెలిసింది. వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరిపి కోర్టులో హాజరు పరచి పాళయంకోట జైలుకు తరలించారు.