
సాక్షి, చెన్నై : భూగర్భజలాలు అడుగంటిపోవడం, నైరుతి రుతుపననాల మందగనంతో వర్షాలులేక చైన్నైలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నగరానికి నీరందించే నాలుగు సరస్సులు ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో గత నాలుగు నెలలుగా చైన్నై వాసులు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. అక్కడ రోజుకు 200 మిలియన్ లీటర్ల నీటి కొరత ఉందంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సమస్యపై తమకు సాయమందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో రైల్వేశాఖ ముందుకొచ్చింది. రైళ్లద్వారా కొన్ని ప్రాంతాలకు నీరందించడానికి సుమారు 2.5 మిలియన్ లీటర్ల నీటిని మోసుకొచ్చే రెండు వాటర్ వ్యాగన్ల రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
చెన్నైకి 217 కిలోమీటర్ల దూరంలోని వేలూరులోని జోలార్‌పెట్టాయ్ నుంచి ఈ రైళ్లు బయలుదేరాయి. విల్లివక్కం రైల్వే స్టేషన్‌కు శుక్రవారం చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లో వాటిని రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన అనంతరం విల్లివక్కం, కిల్‌పాక్ ప్రాంతాలకు నీటిని పైపుల ద్వారా సప్లయ్ చేయనున్నారు. ఒక్కో రైలు 50 వేల లీటర్ల నీటి సామర్థ్యంగల 50 వ్యాగన్లను కలిగి ఉండటం విశేషం. రెండు రైళ్ల ద్వారా రోజుకు 11 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కానుంది. 200 మిలియన్ల కొరతకు కేవలం 11 మిలియన్‌ల నీరు మాత్రమే రవాణా అవుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment