
సాక్షి, చెన్నై: దేశంలోనే ప్రపథమంగా తమిళనాడుకు చెందిన హిజ్రా తారిఖా భాను సిద్ధ వైద్య సీటును దక్కించుకున్నారు. ఆమెకు సీటు కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే, హిజ్రాలకు అన్ని కళాశాలల్లో కొన్ని సీట్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తి కృపాకరణ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తూత్తుకుడికి చెందిన హిజ్రా తారీఖా భాను చెన్నై అంబత్తూరులోని పెరుంతలైవర్ కామరాజర్ బాలికల మహోన్నత పాఠశాలలో ఈ ఏడాది ప్లస్‌టూ మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది.
డాక్టర్ కావాలన్న ఆశతో తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని సిద్ధ వైద్య కళాశాలలో సీటు కోసం ప్రయత్నించగా నిరాకరించారు. తనకు అర్హతలు ఉన్నా హిజ్రా అన్న కారణంతో సీటు నిరాకరించారంటూ మద్రాసు హైకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. వారం రోజుల్లోపు తారీఖా భానుకు వైద్య సీటును ఆమె కోరిన కళాశాలలో ఇవ్వాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వులతో దేశంలోనే తొలి సిద్ధ వైద్య విద్యార్థిగా తారీఖా భాను నిలిచారు. తారీఖా భానును చెన్నై అంబత్తూరుకు చెందిన మరో హిజ్రా గ్రేషి భాను (ఇంజినీరు) దత్తతకు తీసుకుని చదివిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment