అటవీ అధికారులు స్వాధీన పరుచుకున్న పాము పిల్లలు, గుడ్లు
వేలూరు (తమిళనాడు) : గుడియాత్తంలోని ఓ ఇంటి సమీపంలో ఉన్న వంద విషపు పాము పిల్లలు, 80కి పైగా పాము గుడ్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా ఇందిరానగర్‌కు చెందిన జానకిరామన్ గురువారం ఉదయం తన ఇంటి వెనుక వైపునకు వెళ్లాడు. ఒకేచోట వందకు పైగా పాము పిల్లలు ఒకదానిపై ఒకటి పడుకుని ఉన్నాయి. పక్కనే దాదాపు 80 పాము గుడ్లు ఉన్నాయి. వాటిలో నుంచి ఒక్కో పాము పిల్ల బయటకు వస్తుండడాన్ని గమనించి కేకలు వేశాడు. స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆసక్తిగా చూశారు.
గుడియాత్తం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఫారెస్ట్ అధికారి మేఘనాథన్, అసిస్టెంట్ అధికారి మూర్తి, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు వంద పాము పిల్లలను, పాము గుడ్లను తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టారు. స్వాధీనం చేసుకున్న పాము పిల్లలు ఏ రకమైనవని తెలియడం లేదని, అయితే విషపూరితమైనవిగా భావిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఒకే పాము ఇన్ని గుడ్లు పెట్టి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment