
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల నిర్ణయం చాలా గొప్పదని, దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. ప్రజాస్వామ్య పరిరక్షకులందరూ తమ ఎజెండాలను పక్కనపెట్టి మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించాలి. అధికారాన్ని సమానంగా పంచనప్పుడు ప్రత్యేక రాష్ట్ర నినాదాలు వస్తాయి. అందుకు ఉదాహరణగా తెలంగాణ, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలను చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీలో లోపాలేవీ కనిపించనప్పుడు వేర్పాటు వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటాయి. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ఇటీవల కొన్ని పార్టీలు ముందుకు తీసుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెంపపెట్టులాంటిది. ఇప్పటికే కర్ణాటకలో బెంగళూరు, మైసూరులలో రెండు అసెంబ్లీలు, మహారాష్ట్రలో ముంబై, నాగ్‌పూర్‌లలో రెండు అసెంబ్లీలు ఉన్నాయి.
హైకోర్టు బెంచ్‌లు తమిళనాడులో చెన్నై, మధురైలలో ఉన్నాయి. మహరాష్ట్రలో ముంబై, నాగ్‌పూర్‌లలో బెంచ్‌లున్నాయి. తమిళనాడులో ముందు నుంచే అభివృద్ధిని చెన్నైకి పరిమితం చేయకుండా ప్రతీ జిల్లాకు సమపాళ్లలో పంచారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధినంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కే పరిమితం చేయడం వల్ల తెలంగాణ వాదం బలపడింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు చేసిన పనిని అప్పటి పాలకులు చేసి ఉంటే విభజన జరిగేది కాదు. అలాగే దక్షిణాదిలో రెండవ రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఏ ప్రభుత్వం కూడా మా డిమాండ్‌ను పట్టించుకోవట్లేదు. దానికి కారణం దక్షిణాదిలో కేవలం 130 ఎంపీ సీట్లు ఉండడమే. ఇప్పుడు మోదీ నాయకత్వంలో అయినా రెండో రాజధానిని దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment