సాక్షి, చెన్నై: భగవాన్ మాస్టర్ బదిలీపై ఆందోళకు దిగిన విద్యార్థుల పోరాటానికి ఎట్టకేలకు తమిళనాడు సర్కార్ దిగి వచ్చింది. భగవాన్ మాస్టర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఈ అంశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన బదిలీని నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. బదిలీని నిలిపివేయాలంటూ పిల్లలు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భగవాన్‌ను బదిలీ చేయడం లేదని విద్యాశాఖ స్పష‍్టం చేసింది.
భగవాన్ మాస్టారు తిరిగి స్కూలుకు వచ్చారన్న వార్త విన్న విద్యార్థులు స్కూలుకు పరుగులు తీశారు. తమకు ఎంతో ఇష్టమైన టీచర్ తిరిగి రావడంతో విద్యార్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు అంతా సంబురాలు చేసుకున్నారు. మాస్టారును హత్తుకుని తమ ప్రేమను చాటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పరిణామంపై ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తన కోసం పడ్డ తపన చూసి భగవాన్ కళ్లు చెమర్చాయంటూ భగవాన్ సంతోషం వ్యక్తంచేశారు.
ఓ విద్యార్ధి తండ్రి మాటల్లో...
'నా కూతురు దేనికీ ఇంతగా సంతోషపడ లేదు' అని తొమ్మిదో తరగతి చదువుతోన్న సంఘవి అనే విద్యార్థిని తండ్రి వెల్లడించారు.' భగవాన్ సార్ ఏ పాఠమైనా అద్భుతంగా చెప్తారు. ప్రొజెక్టర్ల సాయంతో మాకు అర్థమయ్యే రీతిలో బోధిస్తారని విద్యార్ధులు తెలిపారు.
కాగా తిరువల్లూరు జిల్లా వెల్లియగరం ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ టీచర్ భగవాన్ బదిలీకావడంతో అక్కడి విద్యార్థుల్లో తీవ్ర విచారాన్ని నింపింది. దీంతో వారు తమకెంతో ఇష్టమైన భగవాన్ సార్ తమను విడిచి వెళ్లడానికి అంగీకరించలేకపోయారు. మా సార్ మాకు కావాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment