
పడిపోయిన తేజస్ ఇంధన ట్యాంక్
చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన విమానం గాలిలో ఉండగానే ఇంధన ట్యాంక్ కింద పడిపోయిన ఘటన కలకలం రేపింది. తమిళనాడులోని ఓ పొలంలో జెట్ ఇంధన ట్యాంక్ పడిపోవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం కోయంబత్తూరులో చోటు చేసుకుంది. సులూరు వైమానిక దళానికి సమీపంలో ఉన్న పొలంలో ఇంధన ట్యాంక్ పడిపోవడం గమనించి వెంటనే అప్రమత్తమైన పైలట్.. దానిని సురక్షితంగా నేలపైకి దింపాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పేలుళ్లు గానీ సంభవించలేదని వైమానిక దళం అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
కాగా ఐఏఎఫ్‌నకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్య పరీక్షను తేజస్ గతేడాది విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది.