జియో ఫోన్ల డెలివరీ అప్పటి నుంచే...
జియో ఫోన్ల డెలివరీ అప్పటి నుంచే...
Published Sat, Sep 2 2017 11:19 AM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM
రిలయన్స్ జియో ఫోన్ ఆలస్యమయ్యే వార్త నిజమయ్యేటట్టే కనిపిస్తోంది. ఆగస్టు 24 ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఫోన్ల డెలివరీ మరికొంతకాలం పాటు పట్టవచ్చని రిపోర్టులు వెలువడుతున్నాయి.. ఆగస్టు 24వ తేదీని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో బుకింగ్స్‌కు వచ్చిన ఈ ఫోన్‌కు అరవై లక్షలకు పైగా ప్రీబుకింగ్స్ వచ్చాయని తెలిసింది. ప్రీబుకింగ్స్ మరింత వెల్లువెత్తుతుండటంతో, ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోలేక కంపెనీ వాటిని నిలిపివేసింది కూడా. కేవలం వినియోగదారుల ఆసక్తిని మాత్రమే ప్రస్తుతం నమోదుచేసుకుంటుంది. ఈ అనూహ్య స్పందనతో జియోఫోన్ డెలివరీని నవరాత్రి పండుగ నుంచి ప్రారంభమవుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని కస్టమర్లకే ఈ డెలివరీ తేదీలు సెప్టెంబర్ 25గా కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్లే చెప్పారు. సెప్టెంబర్ 24 తేదీల్లో స్టోర్లలోకి ఈ ఫోన్లు వస్తాయంటూ రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్ ప్రతినిధులు తెలిపారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌డ్ బేసిస్‌లో ఈ ఫోన్‌ను అందించనున్నారు. నగరాల్లో అందుబాటు కూడా భిన్నమైన తేదీల్లో రానున్నాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది.
Advertisement